సినిమాల్లో టిక్కెట్ ధరల పెంపులో పెత్తనం వాళ్ళదే, డ్రగ్స్ లో ఆధిపత్యం వాళ్ళదే, రాజకీయాల్లో జోక్యం వాళ్ళదే, రేవ్ పార్టీల దందా వారే… బెట్టింగ్ చేయండని చెప్పేది వాళ్లే…అసలు వాళ్లు సినిమా నటులా లేక నేరగాళ్లతో చేతులు కలిపే వెండితెర వెనుక ఉన్న విలాన్ లా అనే సందేహం కలుగుతోంది. ఒక్క సినిమాకి కోట్ల రూపాయలు దండుకుంటూ, అవి చాలనట్టు అక్రమ వ్యాపారులతో చేతులు కలపడం నిజంగా కళామతల్లిని క్షోభకు గురిచేయడమే. గత రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఈ అక్రమ వ్యవహారం అంచెలంచెలుగా వేళ్ళూనుకుంటోంది. రంగుల తెర వెనుక సాగుతున్న ఈ నల్ల బజారు వ్యాపారాన్ని ఒక్కసారి అవలోకానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్కటి, పదునైన మాధ్యమంగా సమాజానికి నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన వెండితెర నేడు అక్రమాలకు, వివాదాలకు అడ్డాగా మారింది. “సినీ మాఫియా” సంపాదనే ధ్యేయంగా సినిమాలను సామాన్యునికి అందుబాటులో లేకుండా చేసింది. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో జరిగే వైట్ కాలర్ నేరాల్లో నటుల భాగస్వామ్యం బయటపడుతోంది.

1990 దశకంలో బాలివుడ్ కి చెందిన ప్రముఖ హీరో ఆయుధంతో దొరికి పోవడం, జైలు ఊసలు లెక్క వెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో యువతరాన్ని అశేషంగా ఆకర్షించిన మందాకిని ఏకంగా మాఫియా డాన్ దావూద్ సరసన చేరడం తెలియని సంగతి కాదు. 1980 దశకం చివరిలో తెలుగు నాట అప్పటి ప్రముఖ హీరో ఏకంగా నీలిచిత్రాల ఆరోపణలో జైలు జీవితం గడిపారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందనేది వేరే కోణం. ఇక 2005 సంవత్సరం తర్వాత తెలుగు తెర బడా బాబుల అరాచకాలు మితిమిరాయి.
2007సంవత్సరంలో అప్పటి శివారు ప్రాంతం నానక్ రామ్ గూడ లోని ఎపిక్యూరాస్ గెస్ట్ హౌస్ లో ప్రముఖ నటుని సోదరుడు రేవ్ పార్టీలో పట్టుపడడం కలకలం రేపింది. పోలీసులు సినిమా ఫక్కీలో వెంటాడి మరీ దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదారాబాద్ లో రేవ్ పార్టీ అసలు గుట్టు బయట పడింది ఈ కేసు తోనే కావడం గమనార్హం. ఆ తర్వాత వరుసగా సినీ ప్రముఖులు, వాళ్ల అనుయాయులు ఒక్కొక్కరు కేసుల్లో ఇరుక్కుపోవడం షరామాములు అయింది. 2009 లో ప్రముఖ సినీ, సీరియల్ నటీ బెంగుళూరుల, 2010లో వ్యాంపు క్యారెక్టర్లలో నటించే ఇద్దరు, 2016 బెంగాల్ తెలుగులో నటించే బెంగాలీ నటి హైదారాబాద్ హోటళ్లలో పట్టుబడ్డారు. ఇక 2015 -16 సంవత్సరంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున అతిపెద్ద డ్రగ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ కేసులో అనేక మంది ప్రముఖులు, పేరున్న సినీ నటులు, దర్శకులు బలమైన ఆధారాలతో నిందితులు, అనుమానితులుగా ఉన్నారు. టాలివుడ్ నుంచి పూరీ జగన్నాథ్, రవితేజ, ముమైత్ ఖాన్, ఛార్మి,నవదీప్ లు మత్తు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది బాలీవుడ్ లోనూ ప్రముఖ నటులు ఇదే తరహా కేసుల్లో రుక్కున్నారు. అదేవిధంగా బాలివుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్ ల లోనూ పలుఫురు తారలు డ్రగ్స్ కేసుల్లో విచారణలు ఎదుర్కొన్న్నారు.

మొన్నటి వరకూ మాదకద్రవ్యాలు, వ్యభిచారం వంటి కేసుల రుచి చూసిన కొందరు నటీనటులు ఇప్పుడు సమాజాన్ని ప్రధానంగా సామాన్యులను తప్పుదోవ పట్టించే అక్రమ వ్యాపార, వాణిజ్య దందా ప్రకటనల్లో నటించడం పరాకాష్ట. సినిమాల్లో నటన, నిర్మాణం, పంపిణీ వంటి వ్యవహారాల్లో షరతులు పెట్టి వందల కోట్ల రూపాయలు మూటగట్టుకున్న నటులు చివరకు జనాన్ని తప్పుదోవ పట్టించి, మోసం చేసే ప్రకటనలను సైతం వీడక పోవడం క్షమార్హం. ప్రజలకు జరిగే నష్టాన్ని పట్టించుకోకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా కళామతల్లిని బెట్టింగ్ ముఠాల వద్ద తాకట్టు పెట్టడం పట్ల పలువురు కళాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా నటులతో పాటు, నిన్నగాక మొన్న సామాజిక మాధ్యమాల్లో సొల్లు కబుర్లు వల్లిస్తూ పేరు సంపాదించుకున్నామనే భ్రమలో ఉన్న శ్యామల లాంటి కొందరు కూడా బెట్టింగ్ డబ్బులకు ఆశ పడడం తీవ్రమైన నేరం. విక్తరీ కుటుంబానికి చెందినా రానా, విలక్షణ కుటుంబానికి చెందినా మంచు లక్ష్మి సహా మరి కొందరు ఈ బెట్టింగ్ వ్యాపారానికి మద్దతు పలికే ప్రకటనల్లో నటించడం వివాదంగా మారింది. పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. గతంలో మహా దేవ బెట్టింగ్ యాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలివుడ్ నటి శ్రద్దా కపూర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ యాప్ కేసులో నటుడు రణ్ బీర్ కపూర్ , హాస్య నటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యుమా ఖురేషి, హీనా ఖాన్ కూ ఈడి నుండీ సమన్లు జారీ అయ్యాయి. హవాలా కార్యకలాపాలకు పాల్పడుతున్న మహ దేవ్ యాప్ ప్రమోటర్లు సౌరబ్ చంద్ర శేఖర్, రవి ఉప్పల్ పై ఈడి కేసు నమోదు చేశారు.

గతంలో కేరళ డ్రగ్స్ కేసులో భాగంగా ప్రముఖ నటి, సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు జాతీయ పరిశోధన్ సంస్థ (ఎన్.ఐ.ఎ) సమన్లు జారీ చేసింది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు సమన్లు పంపారు. ఈ కేసులో వరలక్ష్మి మాజీ వ్యక్తిగత సహాయకుడు ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించారు. హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నటి లిషి గణేష్ నిందితురాలిగా ఉన్నారు. ఈ వెలుగు చూసిన తర్వాత కొద్ది రోజుల పాటు ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఇదే కేసులో కీలక నిందితుడు ఈ మధ్య దుబాయ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం. ఇలా దేశ వ్యాప్తంగా సినీ నటులు డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యంగా వెనుకా ముందు ఆలోచించకుండా అక్రమ, దొడ్డి దారి వ్యాపారాలకు వత్తాసు పలకడం సమస్యగా మారింది. వీళ్ళు నటించిన ప్రకనలకు ప్రభావితం కావడం వల్ల అనేక మంది సామాన్య, మధ్య తరగతి యువత ఆర్ధికంగా నష్టపోతున్నరనేది పోలీసుల వాదన. అయితే, ఎలాంటి కేసులు నమోదు కావడమే తప్ప విచారణ సమర్ధవంతంగా ముందుకు సాగిన దాఖలాలు లేకపోవడం విశేషం. పోలీసులు గాని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఎన్.ఐ.ఎ. గానీ చిత్తశుద్దితో దర్యాప్తు చేసి కట్టుదిట్టమైన ఆధారాలు సేకరించి కేసుల ముగింపునకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
