“అఘోరీ” అరాచక “ధర్మం”..!

aghori girl

“సనాతన ధర్మం” ప్రచారం ముసుగులో ఒంటిపై నూలుపోగు లేకుండా జనం మధ్య సంచరిస్తున్న మోసగాళ్లను అదుపు చేయడంలో పోలీసులు పూర్తీ స్థాయి వైఫల్యం చెడుతున్నారు. తలచుకుంటే సామాన్యులను ఏదో ఒక కేసులో ఇరికించే సత్తా ఉన్న ఖాకీలు బట్టలు లేకుండా నడిరొడ్ల పై బరితెగించి తిరుగుతున్న “దొంగ భావాల” అఘోరీని ఎందుకు కట్టడి చేయడం లేదనేది అంతుపట్టని విషయం. తెలుగు రాష్ట్రాల్లో  అఘోరీ అంటూ బాహాటంగా అకృత్యాలు చేస్తున్నా రెండు రాష్ట్రాల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు “సనాతనం” ప్రచారం చేస్తున్న రాజకీయ పక్షాలకు వత్తాసు పలుకుతున్నట్టు ఉందని విమర్శలు పుట్టుకువస్తున్నాయి. ఆత్మహత్య చేసుకుంటా అని పెట్రోలు డబ్బాతో పోలీసులను  బెదిరించినా, ఆడబిడ్డలను లోబరచుకొని లేవదీసుకుపోయినా పోలీసులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే బలమైన ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఒక సంఘటన దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది. కొన్ని నెలల నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సనాతన ధర్మ ప్రచారం, దాని పరిరక్షణ పేరుతో రోడ్ల వెంట నగ్నంగా సంచరిస్తూ, శాంతి భద్రతలకు తలనొప్పిగా మారిన అల్లూరి శ్రీనివాస్ అలియాస్ నాగసాధు గుంటూరు జిల్లాలో ఒక యువతి భవిష్యత్ ని రోడ్డున పడేశాడు. రత్నాల చెరువు ప్రాంతానికి చెందిన వర్షిణి (23) అనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతిని మాయమాటలతో వశ పరచుకొని తన వెంట వచ్చేలా చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆ యువతి తల్లిదండ్రులు ఈ మేరకు మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే… అందమైన, అనువైన అమ్మాయిల వేటలో భాగంగా కొంత కాలంగా  విజయవాడ, గుంటూరు, గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టిన శ్రీనివాస్ (అఘోరీ) మంగళగిరిలో ఒక అమాయక, మధ్య తరగతి కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకున్నాడు. డబ్బు ఆశ చూపి రెండు నెలలుగా ఆ కుటుంబానికి దగ్గరై ఇంట్లో పూజల పేరుతో అసాంఘిక చర్యలు మొదలు పెట్టాడు. ఇంట్లోని వర్షిణి నీ, ఆమె సోదరుడిని టార్గెట్ చేసుకుని నిత్యం రాత్రి వేళల్లో  అసభ్య కార్యకలాపాలు చేస్తుండే వాడు. చివరకు అనేక మాయమాటలతో వర్షిణి ఆలోచనలను మార్చివేసి, పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడని పోలీసులే చెప్పడం విశేషం. ఇదే క్రమంలో మానసిక రోగిగా మారిన వర్షిణి నాలుగు రోజుల కిందట తల్లిదండ్రులను ఎదిరించి ఆఘోరీ దగ్గరకు వెళ్లిందని వివరించారు.తన కూతుర్ని మాయమాటలు చెప్పి అఘోరీ తీసుకు వెళ్లిపోయాడని వర్షిణి తండ్రి తురిమెల్ల కోటయ్య మంగళగిరి  పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. వర్షిణి  ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తోందని, నాలుగు నెలల క్రితం  లేడీ అఘోరి రూపంలో ఉన్న శ్రీనివాస్ మంగళగిరి జాతీయ రహదారిపై ఒంటి మీద బట్టలు లేకుండా రచ్చ చేస్తుంటే, పోలీసుల విజ్ఞప్తి  మేరకు వర్షిణి ముందుకు వెళ్ళి అఘోరికి బట్టలు కప్పిందని తెలిపారు.  అప్పటి నుంచి శ్రీనివాస్ వర్షిణి ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడటం మొదలు పెట్టి కొన్ని రోజుల తర్వాత ఏకంగా ఇంటికి వచ్చినట్టు కోటయ్య వివరించారు. పూజల పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తూ  మాయ మాటలతో వర్షిణిని వశపరచుకున్నాడని, ఆకు పసరు లేపనాలు శరీరానికి పట్టించే వాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్షీణి తిరిగి తన వద్దకు రావాలంటే అఘోరీపై చర్యలు తీసుకోవాలన్నారు.

wgl burrial in

ఇదిలా ఉంటే, అనేక నెలలుగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు సవాలుగా మారిన అఘోరీ ఆకృత్యాలను ప్రభుత్వాలు, పోలీసు  అధికారులు ఎందుకు ఉపెక్షిస్తున్నారనేది ప్రశ్నార్ధకం. జాతీయ రహదార్లు, దేవాలయాల వద్ద పోలీసులను బెదిరించడం, గ్రామాల్లో నగ్నంగా సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, రాజకీయ నేతలను ధూషించినా అఘోరీ పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ అఘోరి సంచారాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ వద్ద నిర్ధిష్టమైన నిబంధనలు లేవా, ఉన్నా గానీ చర్యలు తీసుకోలేక పోతున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే అదునుగా చేసుకొని మహిళా అఘోరీ పోలీసు అధికారులతో అడ్డగోలుగా వాదనలకు దిగుతోంది. తనను అడ్డుకుంటే ఆత్మహత్యకు పాల్పడుతా అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం విపరీత ధోరణికి అద్దం పడుతోందని హేతువాద నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఘటన పై కూడా పోలీసులు కేసు నమోదు దాఖలాలు లేవు. తాజాగా వరంగల్ జిల్లాలోని మామునూరు స్మశాన వాటికలోకి కారుతో సహా చొచ్చుకు వెళ్లి, దిగంబరంగా చేసిన హడావుడితో అధికారులు తలపట్టుకున్నారు. అంతేకాదు, ఆమెకు వివిధ దేవాలయాల్లో వీఐపీ హోదాలో దర్శనం, పూజలకు అనుమతి ఇవ్వడంతో పరిస్థితి చేజారి పోతందని పలువురు పోలీసు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్నే అలుసుగా తీసుకొని తనను ఎవరూ అడ్డుకోలేరన్న ధీమాతో ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సైతం వ్యాఖ్యలు చేస్తోందని పేర్కొంటున్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ ఇంకా తనతో మాట్లాడలేదని, రేవంత్ రెడ్డికి సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సమస్యాత్మకంగా మారిన అఘోరీని అరెస్టు చేసి మానసిక రోగుల ఆసుపత్రికి తరలించి సరైన చికిత్స అందించాలని హేతువాద సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరింత జాప్యం చేస్తే వర్షిణి లాంటి అమాయక యువతులు మరికొందరు అఘోరీ మాయలో పడే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. అఘోరీని అదుపులోకి తీసుకోవడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని కొందరు సీనియర్ పోలీసు అధికారులు చెప్పడం కొస మెరుపు. మంగళ గిరి వర్షిణి కేసు విషయంలో పోలీసులు చిత్తశుద్దితో వ్యవహరించి అఘొరీని అదుపులోకి తీసుకోని విచారిస్తే అనేక వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని ఇటు ప్రజలు,హేతువాదులే కాదు కొందరు ఆధ్యాత్మిక వేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాక, అఘోరీ కి వివిధ దేవాలయాల వద్ద కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రాధాన్యతను కూడా పూర్తిగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *