తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో డా.బీఆర్. అంబేడ్కర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బోనాలు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి గత తొమ్మిదేళ్ళుగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. బోనాల ఉత్సవాలకు ఈ ఏడాది రూ.15 కోట్లు కేటాయించారని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుని బోనాలను ఘనంగా నిర్వహించాలని చెప్పారు. డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్, తదితరులు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జూలై 9వ తేదీన సికింద్రాబాద్ మహాంకాళి బోనాలు, 16న హైదరాబాద్ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలకు వారం రోజుల ముందే ఆలయాల్లో బోనాల ఏర్పాట్ల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్‌లు అందజేయాలని అధికారులకు సూచించారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.