కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అటు ఏపీ, ఇటు తెలంగాణలో ముమ్మరంగా కార్యక్రమాలు చేపడుతోంది. కొన్ని రోజులు క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టారు. పీపుల్స్ మార్చ్ పేరుతో దాదాపు 109 రోజులు పాటు ఆయన ప్రజల్లో తిరిగారు. ప్రస్తుతం భట్టి చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఏపీ కాంగ్రెస్ నేతలు ఆయనను ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడ నుంచి రాహుల్ గాంధీ ఖమ్మం సభకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. కర్ణాటక మాదిరి తెలంగాణలోనూ ఆకట్టుకునే పథకాలను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక రోడ్డు పొడవునా ప్రజలకు అభివాదం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అటు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద రాహుల్ గాంధీని ఏపీ కాంగ్రెస్ నేతలు సైతం కలుస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాహుల్‌తో చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ పర్యటన చర్చనీయాంశంగా మారింది.