నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ అసిస్టెంట్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించిన వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిత్తల్, వాకాటి కరుణతో పాటు ఇంకొందరు అధికారులకు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని, ఆ మొత్తాన్ని 4 వారాల్లో చెల్లించకుంటే నెల రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఐఏఎస్‌ల తో పాటు . కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు జి.యాదగిరి, కల్వకుర్తి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్.స్వర్ణలతకు కూడా ఇదే శిక్ష విధించింది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావును 2022 ఆగస్టు 5 నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఆయన్ని తొలగించే అధికారం కమిషనర్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం జాయింట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయవచ్చని పేర్కొంది. తనను ఉద్యోగం నుంచి కమిషనర్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాసరావు కోర్టును ఆశ్రయించగా 2022 సెప్టెంబరులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 2022 ఆగస్టు 5 నుంచి అక్టోబరు 26 వరకు విధుల్లోకి తీసుకుంటున్నట్లు జాయింట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉద్యోగంలోకి తీసుకోకుండానే 2022 అక్టోబరు 26న శ్రీనివాసరావును సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో బాధితుడు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్ పి.మాధవీదేవి తీర్పు వెలువరించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత పునర్నియామక ఉత్తర్వులు ఇచ్చారని, నోటీసులు జారీ అయ్యాక జీతం చెల్లించారన్నారు. అంటే కోర్టు ఉత్తర్వుల నుంచి తప్పించుకోవడానికే అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు చేశారన్నారు. అందుకే వారికి కోర్టు ధిక్కరణ కింద శిక్షగా రూ.10 వేలు జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు.