“అసంఘటిత” దోపిడీ..

IMG 20250505 WA0014

సమాజంలో ఆధునికంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా అసంఘటిత కార్మిక రంగం విస్తరిస్తోందని, ఇదే సమయంలో కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ అన్నారు. వస్తు సేవల రంగం విస్తరణ, ఆన్లైన్ వ్యాపారం, ఇతర ప్రాంతాల నుంచి లేబర్ వలస వంటి కారణాల వల్ల అసంఘటిత కార్మికులు ఉపాధి సమస్యతో పాటు తక్కువ కూలీ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రానున్న కాలంలో అసంఘటిత కార్మికుల సమస్యలు తీవ్రం కానున్నాయని, ఆ కార్మికుల తరఫున ఉద్యమాలకు సిద్ధం కావాలని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు.జేఎస్టీయూసీ రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్ లోని జై స్వరాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌడ మాట్లాడుతూ కార్మిక, కర్షక ఉద్యమాలు విస్తృతం చేయాలని, అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీని ఉద్యమాలకు అనుసంధానం చేసుకోవాలని తమ శ్రేణులకు వివరించారు.

రానున్న రోజుల్లో జేఎస్టీయూసీ చేపట్టనున్న కార్యక్రమాలను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం వెల్లడించారు. ప్రతి అసంఘటిత కార్మికులకు నెలలో కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలని, కార్మికుల పిల్లలకు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, ఇళ్లు లేని కార్మికులకు రెండు పడకల ఇల్లు లేదా 250 గజాల ఇంటి ‌స్థలం ఇవ్వాలని, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో స్థానిక కార్మికులకు అవకాశం ఇవ్వాలని, 60 ఏళ్లు నిండిన కార్మికులకు కూడా లేబర్ కార్డులు కొనసాగించాలని, సహజ మరణాలకు ఇచ్చే బీమా 5 లక్షల రూపాయలు చేయాలని, మహిళా కార్మికుల మెటర్నిటీ బెనిఫిట్ 50 వేల రూపాయలు చేయాలని, కార్మికుల కుటుంబంలో అమ్మాయి వివాహానికి ఇచ్చే బెనిఫిట్ 50 వేల రూపాయలు చేయాలని, కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే ప్రమాద బీమా 10 లక్షల రూపాయలకు పెంచాలని, భవన నిర్మాణ కార్మికులకు ఫించన్ 5 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్లతో ఉద్యమాలను ఉధృతం చేస్తామని రత్నం వివరించారు. జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి యామిని లక్ష్మీ, జై స్వరాజ్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గుర్రం శ్రీ కృష్ణ, జేఎస్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంజ గణేష్, జేఎస్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ తదితరులు ఆయా అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో జేఎస్టీయూసీ మేడ్చల్ మల్కాజిగిరి అధ్యక్షుడు మంతపురం శ్రీను, జేఎస్టీయూసీ నాయకులు జయరాజ్, గూడెం రాజు, వెంకటేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *