రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ రానున్న 48 గంటలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐ.ఎం.డి హెచ్చరించిన నేపథ్యంలో ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే గోదావరి బేసిన్ లో పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తి స్థాయి నీటి మట్టం తో ప్రవహిస్తున్నాయని, రెండు రోజుల్లో కురిసే భారీ వర్షాల వల్ల అవి మరింత ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశముందని హెచ్చరించారు. నిండిన ప్రతీ చెరువు వద్ద, ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కాజ్- వే లవద్ద ప్రత్యేక అధికారులు, పోలీస్ అధికారులను నియమించి తగు జాగ్రత చర్యలను చేపట్టాలని అన్నారు.
వరంగల్ లో రోడ్డు..
లోతట్టు ప్రాంతాలు, ముంపుకు గురయ్యే ప్రాంతాలలో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన పునరావాస కేంద్రాలలో అవసరమైన వస్తు సామాగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాలకు దెబ్బతినే రాష్ట్ర, నేషనల్ హైవే రోడ్లను వెంటనే మరమ్మతులు జరపాలని ఆదేశించారు. భద్రాచలంలో ఇప్పటికే ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేసారని, గోదావరి కి వచ్చే వరదను సమీక్షిస్తూ తగు జాగ్రత చర్యలను తీసుకోవాలని కోరారు. అన్ని గ్రామాలలో శానిటేషన్ పనులను ముమ్మరంగా నిర్వహించాలని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణా రావు, రజత్ కుమార్, సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, జీహెచ్ ఎంసీ కమీషనర్ రొనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.