భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. గురువారం ఉదయానికి 50.50 అడుగులకు చేరుకుంది. దీంతో 3 వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాద్రి దేవస్థానం ముందున్న విస్టా కాంప్లెక్స్, అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. గోదావరి ఉధృతిని ముందు నుంచే అంచనా వేస్తున్న అధికారులు 10 రోజుల క్రితమే పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు భద్రాచలంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక కూడా అర్ధరాత్రి 2 గం. ల వరకు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. భద్రాచలం వద్ద నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది.ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం రేగుబల్లి వద్ద వరదనీరు రహదారిపైకి చేరింది. రహదారులపైకి వరద చేరడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, కూనవరం, చింతూరు, వీఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదిలా ఉంటే, నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద నీరు పరవళ్ళు తొక్కడంతో 14 గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువ భాగం నుంచి మరింత వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 12 గ్రామాల ప్రజలనుఅధికారులు అప్రమత్తం చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం అంతకుమించి నీటిమట్టం పెరుగుతోంది. 4 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అయితే 4 గేట్లు ఓపెన్ కాకపోవడంతో 2.50 లక్షల క్యూసెక్కుల నీరే కిందకు వెళ్తుంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని కడెం ప్రాజెక్టు పరీవాహక ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు కృష్ణమ్మ ప్రవాహం ఉధృతం కావడంతో జూరాల గేట్లు ఎత్తివేత ఎత్తివేశారు. కర్ణాటక జలాయశయాల నుంచి కృష్ణమ్మా జూరాలకు పరుగులు తీయడంతో భారీగా వరద నీరు చేరుతోంది.నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు.