వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పది వేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రాష్ట్ర వైద్య రంగం దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తూ, దేశానికే ఆదర్శంగా పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ప్రగతి భవన్ నుండి వర్చువల్ పద్దతిలో 9 వైద్య కళాశాలలను కేసీఅర్ ప్రారంభించారు.
కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో నేటి నుండి నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ ఏ ఎం రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, వైద్యశాఖ సిఎం వోఎస్డీ డా. గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీ.సీ కరుణాకర్ రెడ్డి, టిఎస్ ఎం ఐ డీసీ ఎం.డీ, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.