క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సి) రెండో సీజన్ మొదలవుతోంది. మెగా లీగ్ రెండో సీజన్ తొలి దశ శనివారం రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. దిగ్గజ క్రికెటర్లు మునాఫ్ పటేల్, ప్రవీణ్ తాంబే, హషీమ్ ఆమ్లా, ఆండ్రూ లీపస్, రామన్ రహేజా ప్రధాన వేదికపైకి వచ్చి ట్రోఫీని ఆవిష్కరించారు. రాంచీలోని జేస్‌సీఏ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ నేతృత్వంలోని భిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ పోటీ పడుతాయి. ఎప్పటి లాగానే అభిమానులకు ఈ లీగ్ అంతులేని ఆనందాన్ని పంచనుంది. లీగ్ ప్రారంభం ముంగిట భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ మాట్లాడుతూ, ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్ దేశంలోని అతిపెద్ద లీగ్స్‌లో ఒకటి. ఈ సీజన్‌ను రాంచీలో ప్రారంభం అవడం గురించి మాట్లాడేటప్పుడు నా కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒక్క పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. పెవిలియన్‌పై ధోనీ పేరు ఉన్న స్టేడియం ఖచ్చితంగా దేశంలోని అత్యుత్తమ స్టేడియాల్లో ఒకటి’ అని అన్నారు. వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఫైనల్ పోరు కోసం తాము ఎంతో ఉత్సాహంగా ఉన్నామని చెప్పాడు. ఈ టోర్నీలో భారత్ విజయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు..