చచ్చి పోతున్నారు…స్థలాలు ఇవ్వండి….

nizmpet1
nizmpet

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులకు ప్రతీ ఒక్కరు కట్టుబడి ఉండాలి. సుప్రీం కోర్ట్ ఆదేశాలను విధిగా, బాధ్యతగా గౌరవించాలి, అమలు చేయాలి. కానీ, తెలంగాణలో జరుగుతున్న తంతు అందుకు భిన్నంగా ఉంది. ఎప్పుడో 16 సంవత్సరాల కిందట హైదరాబాద్ లో జర్నలిస్టులు కొనుగోలు చేసిన ఇళ్ళ స్థలాల వ్యవహారం కోర్టుల్లో నలిగి చివరకు 14 ఏళ్ల సుధీర్గ విచారణల తర్వాత  జర్నలిస్టులకు కేటాయించిన  స్థలాలు వారికి ఇవ్వాలని  గత ఏడాది  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. చాలీ, చాలని జీతాలతో సమాజం కోసం పని చేస్తున్న విలేకరులకు స్థలాలు ఇవ్వడం సముచితమే అని కూడా అభిప్రాయపడుతూ అప్పటి చీఫ్ జస్టిస్ రమణ బెంచ్ ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం.  కానీ, నెలలు గడుస్తున్నా ఆ తీర్పును అమలు చేయడంలో జరుగుతున్న జాప్యం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ  హౌసింగ్ సొసైటీ కేటాయించిన భూమిని అప్పగించడంలో ఎందుకు జాప్యం జరుగుతుందనేది అంతుపట్టడం లేదని సొసైటీ సభ్యులు సహా, ఇతర జర్నలిస్టులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుప్రింకోర్టు తీర్పు రాగానే ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కారం చేస్తామని మొన్నటి వరకు చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ , ఇతర ప్రభుత్వ అధికారులు తీర్పు వెలువడిన తర్వాత నోరు మెదపక పోవడం పట్ల  ఆందోళన చెందుతున్నారు. సోసైటిలోని సభ్యులు చనిపోతున్నపటికి స్థలాలు మంజూరు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 60 మందికి పైగా సొసైటి సభ్యులు చనిపోయారు. ఖమ్మం, నిజామాబాద్, ఆందోల్ వంటి ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఒకవైపు తాజాగా భూములు కేటాయిస్తూ, ఏళ్ల తరబడి  పెండింగ్ లో ఉన్న తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోక పోవడం సమంజసంగా లేదనే  వాదన వినిపిస్తోంది. సుప్రింకోర్టు తీర్పును గౌరవిస్తూ పేట్ బహీరాబాద్ లో కేటాయించిన భూమిని వెంటనే సొసైటికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

జర్నలిస్టుల స్థలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును  ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌, ఎపి  మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావులు కూడా తప్పు పడుతున్నారు.  జవహర్ లాల్ నెహ్రూ  హౌసింగ్ సొసైటీ కేటాయించిన భూమిపై తెలంగాణ ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణలో జర్నలిస్ట్ ఇంటి స్థలాలపై సుప్రీం తీర్పు కూడా వచ్చింది. ఆలస్యం చేయకుండా జవహర్ హౌసింగ్ సొసైటీ కేటాయించిన భూమిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు చనిపోయారు. వారి కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయని,  ప్రభుత్వం తక్షణమే ఆ భూములను జర్నలిస్టులకు అప్పగించాలని, జవహర్ సొసైటీ సభ్యులతో పాటుగా మిగతా జర్నలిస్టులకు కూడా  ఇంటి స్థలాలు ఇవ్వాలని  దేవులపల్లి అమర్ ప్రభుత్వాన్ని కోరారు. సుప్రింకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా తెలంగాణలో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి అక్కడి ప్రభుత్వం తగిన  ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై  జర్నలిస్టుల్లో  అసంతృప్తి ఉందని కొమ్మినేని శ్రీనివాస్ అన్నారు. జర్నలిస్టు సంఘాలు సైతం ఈ సమస్యలో జోఖ్యం  చేసుకొని, పరిష్కరించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *