ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విభాగాల్లో ఆరోగ్య శాఖ ఒకటి. అంతటి ప్రాధాన్యం ఉన్న శాఖకు దశాబ్ద కాలంగా పట్టిన “వైరస్”వదిలిందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ శాఖలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఒక అధికారి గత అధికార పార్టీ జెండాను భుజాన వేసుకోవలనే ఆత్రుతతో “దొర” కాళ్ళు పట్టి మరీ తిరగడం, వైద్య కళాశాలల్లో విద్యా బుద్ధులు చెప్పే వారికి దిశానిర్దేశం చేయాల్సిన మరో అధికారి “ఒంటెద్దు” ప్రభుత్వం తనదే అన్నట్టు వ్యవహరించడంతో వైద్య రంగం, అందులో పనిచేసే అధికారులు, సిబ్బంది ఇంతకాలం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆ ఇద్దరు అధికారులలో ఒకరు ప్రజారోగ్య శాఖ సంచాలకులు గడల శ్రీనివాస్ కాగా,మరొకరు వైద్య విద్య శాఖ ఇంచార్జి సంచాలకులు రమేష్ రెడ్డి. ఈ ఇద్దరు మొన్నటి “ఒంటెద్దు” ప్రభుత్వంలో ఆరోగ్య శాఖకు తామే అధిపతులం అనే సూచన కంటే పెత్తందారి తనంతో ఉద్యోగుల్లో ఎక్కువగా భయాన్ని కలిగించారు. ఏ చిన్న సహాయం కావాలన్నా ఆరోగ్య సిబ్బంది ఎక్కడికి వెళ్ళాలో, ఎవర్ని కలవాలో తెలియని దయనీయ స్థితిని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు అధికారుల బాధ్యతల వ్యవహార శైలిపై బహిరంగ ఆరోపణలు,అసంతృప్తి ఉంది. ఆరోగ్య శాఖలో కింది స్థాయి ఉద్యోగులే కాదు, ఆసుపత్రుల సూపరింటెండెంట్ స్థాయి అధికారులు మొదలు వైద్యుల వరకు ఈ అధికారుల వల్ల నానా రకాల ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల వివిధ శాఖల్లోని అనుభవజ్ఞులకు ఎదురైనా చేదు అనుభవాలే ఆరోగ్య శాఖను కూడా పట్టీ పీడించాయి.
ప్రధానంగా వైద్య విద్య శాఖలో అర్హులైన సీనియర్ వైద్యులు ఉన్నప్పటికీ వాళ్లందరినీ పక్కకునెట్టి కీలకమైన సంచాలకుని స్థానంలో ఇంచార్జి డి.ఎం.ఇ.గా రమేష్ రెడ్డిని నియమించడం వివాదంగా మారింది. విభజన సమయంలో డి.ఎం.ఇ. పోస్టు ఆంధ్రప్రదేశ్ కి చెందుతుందనే విషయాన్ని 2014 లోనే తెలంగాణ ప్రభుత్వం ఆ పోస్టును గుర్తించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎంత మాత్రం పట్టించుకోలేదు. దీనివల్ల పాలకులదే ఇష్టారాజ్యం అయింది. డి.ఎం.ఇ. పోస్టును ఏర్పాటు చేయాలనే హైకోర్టు ఆదేశాన్ని కూడా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. 2021 వ సంవత్సరంలో 699 నెంబర్ జీ.ఓ. జారీ చేసి రమేష్ రెడ్డిని ఇంచార్జి డి.ఎం.ఇ.గా నియమించింది, ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. ప్రభుత్వ నిర్వాకం, డి.ఎం.ఇ. పోస్టు నియామకాన్ని సవాలు చేస్తూ సీనియర్ వైద్యులు కోర్టు మెట్లు ఎక్కారు. ఇందులో భాగంగా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి సుపరింటెన్ డెంట్ నరేంద్ర పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ ని హైకోర్టు కోర్టు పరిగణలోకి తీసుకోని విచారణ చేపట్టింది. రమేష్ రెడ్డి నియామకం వల్ల అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు డి.ఎం.ఇ. పోస్టు దక్కలేదనే విషయాన్ని నరెంద్ర న్యాయవాది కోర్టు దృష్హికి తీసుకువెళ్ళారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్ లతో కూడిన ధర్మాసనం డి.ఎం.ఇ. పోస్టును ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మొన్నటి వరకు ఉన్న ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, రెండు రోజుల కిందట తప్పుకున్న రమేష్ రెడ్డిలను వ్యక్తీ గతంగా కోర్టుకు వచ్చి సమస్యపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల 21న రమేష్ రెడ్డి హాజరై తను రాజీనామా చేసిన విషయాన్ని కోర్టుకు చెప్పారు. అయితే, కొత్త ప్రభుత్వంలో రిజ్వీ బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొత్తగా బాధ్యలు చేపట్టిన క్రిష్టినా హాజరు కావలసి ఉంది. అందుకు ఆమె తరఫున గడువు కోరడంతో జనవరి 10వ తేదీన హాజరు కావలసిందిగా కోర్టు సూచించింది. అయితే, గత మూడు,నాలుగు ఏళ్ళుగా వైద్య విద్యా శాఖ ద్వారా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల హడావిడి మొదలైంది. పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు, వ్యయాలు చేశారు. ఇలాంటి సమయంలో ఇంచార్జి డి.ఎం.ఇ. ఆధిపత్యం చెలాయించడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు సైతం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గానీ, ఆరోగ్య శాఖ మంత్రి గానీ ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఈ నెల 3వ తేదిన జరిగిన ఓట్ల లెక్కింపు రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసిన మరుక్షణమే డి.ఎం.ఇ.కార్యాలయం వద్ద ఉద్యోగులు, సిబ్బంది ఉత్సవాలు చేసుకున్నారంటే వారు ఇంతకాలం ఎంత అసహనంగా ఉన్నారనేది తెలిసి పోతోంది.
ఇక మరో కీలక విభాగం ప్రజారోగ్యం. దీనికి సంచాలకులుగా ఉన్న గడల శ్రీనివాస్ వ్యవహారం మరో కోణం. గతంలో ఎన్నడూ ఏ అధికారికి తలెత్తని కొత్త ఆలోచన శ్రీనివాస్ సొంతం అయింది. అధికారులు, ఆసుపత్రుల బాగోగులు చూసుకోవలసిన అయన రాజకీయాల పై మోజు పెంచుకున్నారు. ఉన్నతాధికారిగా హుందాగా నడుచుకోవలసిన ఆయన ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కళ్ళకు బానిసలా మారి విమర్శలు ఎదుర్కొన్నారు. సొంత ఖమ్మం జిల్లా నుంచి బిఆర్ఎస్ టికెట్ ఆశించారు. కొన్ని సందర్భాల్లో ఇదే విషయం రాష్ట్రం మొత్తం కోడై కూసింది. గత ఏడాది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా కోఠీ లోని ప్రజారోగ్య కార్యాలయ సముదాయం మొత్తం ఆయన ఫొటోలతో కూడిన హోర్డింగులు, బ్యానర్లతో నిపివేయడం గమనార్హం. గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. ఈ విచిత్రమైన పరిణామం కూడా చర్చకు దారి తీసింది. కానీ, దురదృష్టవశాత్తూ శ్రీనివాస్ రాజకీయ గోడును అప్పటి ముఖ్యమంత్రి పక్కన పెట్టారు. దీంతో చేసేది లేక సంచాలనునిగా కొనసాగారు. ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా చేస్తారనే వదంతులు సైతం గుప్పుమన్నాయి. కరోన కాలంలో సమర్ధవంతంగా పనిచేశాడనే ప్రశంసలు ఉన్నప్పటికీ ఆయన రాజకీయాల వైపు మొగ్గు చూపడం ఈ రోజు ఆయన స్థాన చలనానికి దారి తిసినట్టు అయింది. మొత్తానికి కొత్త ప్రభుత్వం కోఠీ ఆరోగ్యశాఖ కార్యాలయ సముదాయంలో ఉన్నతాధికారుల మార్పు ఉద్యోగులు, వైద్యుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. కొత్తగా వచ్చే అధికారులు తమ సమస్యలకు న్యాయం చేస్తారనే కొండంత ఆశతో ఉన్నారు..