మార్కెట్లో వెల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగాయి. అల్లం,వెల్లుల్లి ధరలు వింటేనే ఘాటు నషాళానికి ఎక్కుతోంది.ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల దగ్గర కొండెక్కి కూర్చొని సామాన్యులను వెక్కిరిస్తోంది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది. దీంతో ఈ పంట పొలాల పై దొంగల కన్ను పడింది. కొన్ని చోట్ల దుండగులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడం కోసం రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉల్లి పంటకు పేరుగాంచిన మధ్యప్రదేశ్ లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతం లోని అయిదారు గ్రామాలకు చెందిన పొలాల్లో ఎల్లిగడ్డ చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఈ దొంగతనాలు అదుపు లోకి వచ్చాయని రైతులు తెలిపారు.
వెల్లుల్లి ధరలు గత 60 ఏళ్లలో ఎప్పుడూ ఇంతగా పెరగలేదని రైతులు చెబుతున్నారు. వెల్లుల్లి సాగు చేసిన అనేక మంది రైతులు ధనవంతులయ్యారు, కానీ ఇప్పుడు తాము పండించిన పంట చోరీకి గురవుతుందనే భయంతో ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని చింద్వారా జిల్లాలో దాదాపు 1,500 హెక్టార్ల భూమిలో వెల్లుల్లి పంటను పండిస్తారు. 2023 లో వెల్లుల్లికి మంచి ధర రాకపోవడంతో రైతులు పంట వేయడానికి ఆసక్తి చూపలేదు. ఎకరానికి సగటు ఉత్పత్తి 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు ఉంటుందని రైతులు వివారించారు . పెరుగుతున్న ఉల్లి ధరలు రైతులకు వరంగా మారడం ఒక రకంగా సంతోషమే. కానీ, సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాత్రం పెరిగిన ధరల ఘాటును తట్టుకోలేక పోవడం గమనార్హం.