భారత రాష్ట్ర సమితి (భారాస) నేతలు ఇంకా ప్రత్యేక తెలంగాణ వాదాన్ని మరచిపోయినట్టు లేరు. తెలంగాణా ఏర్పడి పదేళ్ళయినా, అప్పటి నుంచి మొన్నటి వరకు అధికారం చెలాయించిన విషయాన్ని విస్మరించి ఇంకా ఉద్యమ సమయంలోని ఆలోచనలతో ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశబ్ధం కిందటే ప్రత్యేక తెలంగాణా ఏర్పడిందని, ఆ రాష్ట్రంలో ఉంటున్నామనే విషయం తెలిసి కూడా అప్పట్లో రాజశేర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో తెలంగాణా కోసం వ్యవహరించినట్టు ఇప్పటి బి.అర్.ఎస్. నేతలు ప్రవర్తించడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికి గత రెండున్నర నెలలుగా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, బాల్క సుమన్, శ్రీహరి వంటి నేతలు కొత్త ప్రభుత్వం పై అర్ధం లేకుండా, అసందర్భంగా విరుసుకు పడుతున్న తీరును నిదర్శనంగా చూపుతున్నారు. అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు కెటిఆర్ మాటల్లో స్పష్టం అవుతోందనే వ్యాఖ్యలు క్రమంగా తెర పైకి వస్తున్నాయి. ఇటీవల కేటీఆర్, కవిత సహా కొందరు భారాస నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ప్రతీ విషయంలో వ్యతిరేకించే ప్రకటనలు చేయడమే దీనికి సాక్ష్యమనే వాదనలు బలంగా వస్తున్నాయి.
“సారు” శాపమే క్రమబద్దీకరణ..!
ఇటీవల భారాస ఎత్తుకుంటున్న అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పై కావాలనే గులాబీ దళం ఒత్తిడి తీసుకురావడానికి పూనుకున్నట్టు కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి లే అవుట్ క్రమబద్దీకరణ పథకం (ఎల్.అర్.ఎస్) అంశం ఒక ఉదాహరణగా చూపుతున్నారు. తెలంగాణా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వమే క్రమబద్దీకరణకు బీజం వేసిందనే నిజం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియని విషయం కాదు. మద్యతరగతి వర్గాలు మరచిపోలేని విషయం కాదు. ఈ ప్రక్రియ ద్వారా కోట్ల రూపాయలు ఖజానాకు చేరుతాయని అప్పట్లో ఆ ప్రభుత్వంతో అంటకాగిన సీనియర్ ఐఎఎస్ అధికారులు నేరుగా ప్రభుత్వాధినేతకు పూసగుచ్చినట్టు వివారించారు. అందుకే 2014 లో అధికారంలోకి రాగానే క్రమబద్దీకరణ అంటూ 2015వ సంవత్సరంలో 131 జి.ఒ.రూపంలో ఒకవైపు రియల్ ఎస్టేట్ సంస్థల పై మరో వైపు సామాన్య జనం పై మోయలేని భారం మోపారు. అదే అదునుగా వేల కోట్ల రూపాయలను రుసుము రూపంలో ఖజానాలో వేయించుకున్న వ్యవహారానికి ఆయా పురపాలక సంఘాల్లో నేటికీ ఉన్న రికార్డులు, ప్రజల చేతుల్లో ఉన్న ఎల్. ఆర్. ఎస్. కాగితాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ పధకంతో ఆందోళన చెందిన అనేక మంది అప్పులు చేసి మరీ తమ స్థలాలను క్రమబద్దీకరణ చేయించుకున్నారు. అంతేకాదు, 2020 సంవత్సరంలో మారకొన్ని మార్పులతో కూడా వేల కోట్ల రూపాయలే లక్ష్యంగా మరోసారి క్రమబద్దీకరణను తెరపైకి తెచ్చి తెలంగాణాలోని అన్ని జిల్లాల నుంచి వెయ్యి రూపాయల రుసుముతో ధరఖాస్తులు స్వీకరించి పెండింగులో పెట్టిన విషయం బహిరంగ రహస్యం. ఈ సంగతి అప్పటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కి గుర్తు లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన క్రమబద్దీకరణను ప్రజల ప్రయోజనం కోసం పూర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి క్రమబద్దీకరణను మళ్ళీ చేపట్టాలని యోచించడంతో వేలాది మంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గతంలో వేల కోట్ల రూపాయలు ముక్కు పిండి వసూలు చేసిన బి.అర్.ఎస్. ప్రభుత్వ మాజీ మంత్రులు, నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా మాట మార్చి రెడ్డెక్కే ప్రయత్నాలు చేయడం అర్ధం కానీ వ్యవహారంగా ఉంది. ఎలాంటి రుసుము తీసుకోకుండా క్రమబద్దీకరణ చేయాలని భారాస పొంతన లేని డిమాండ్ కి దిగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు, హైదారాబాద్ లోని ప్యారడైజ్ కూడలి నుంచి శామీర్ పేట వరకు ఎలివేటెడ్ క్యారిడర్ కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని కూడా భారాస నేతలు తప్పుపట్టడం మరో సమస్యగా మారింది. ఈ రహదారి సమస్య తీవ్రత తెలిసి కూడా ప్రగతి భవన్ దాటి కేసిఆర్ బయటకు రాక పోవడం వల్లే కేంద్రం ఎలివేటెడ్ క్యారిడర్ అంశాన్ని పక్కన పెట్టిందనే వాస్తవం ఆనాటి, ఈ నాటి ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నేతలకు తెలిసిన వ్యవహారమే. కేసీఆర్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి మెప్పించి ఉంటే భారాస హయంలోనే దీనికి ఆమోదం లభించేదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
తప్పించుకునే తంటాలు…
కేంద్రంతో ఉన్న అనేక రకాల రాజకీయ కారణాలతో “గడీ” దాటని కేసీఆర్ విషయాన్ని కేటీఆర్ కప్పిపుచ్చే విధంగా మాట్లాడడం విస్మయ పరుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి రాష్ట్రానికి వచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రధానిని కలవడం తప్పని సరి అనే విషయం పదేళ్ళు అధికారంలో ఉన్న భారాస నేతలకు తెలియని అంశం కాదు. భారాస హయాంలో ఎన్నిసార్లు మోడీ రాష్ట్రానికి వచ్చారు, శ్రీనివాస యాదవ్, ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వం తరఫున ఎన్నిసార్లు ఆయనకు స్వాగతం, వీడ్కోలు పలకడానికి బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళారనేది అందరికీ తెలిసిన విషయమే. మోడీని రేవంత్ రెడ్డి ఆదిలాబాద్, హైదరాబాద్ పర్యటనల్లో కలవడాన్ని గులాబీ దళం ఎందుకు జీర్ణించుకోలేక పోతుందో రాజకీయ పరిశీలకులకు సైతం అంతు చిక్కడం లేదు. రేవంత్ రెడ్డి ప్రతీ ప్రసంగాన్ని, ఆయన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అనాలోచితంగా వక్రీకరించి వివాదాస్పదం చేయాలని ప్రయత్నించడం వెనుక రాజకీయ కారణాలు, ఎత్తుగడలు సామాన్యులకు సైతం ఇట్టే అర్థమవుతున్నాయి. ఇవే కాదు జ్యోతిరావు పులే విగ్రహం ఏర్పాటు, ఆరు గ్యారంటీల అమలు, ఉద్యోగ నియామకాలు వంటి అంశాల్లోనూ భారాస అనుసరిస్తున్న విధానాలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పదేళ్ళలో నియామకాల ఊసే ఎత్తని కెసిఆర్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా నియామకాల ప్రక్రియ చేపడుతుంటే బాధ్యత గల ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాల్సింది పోయి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడాన్ని విద్యార్ధి, నిరుద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి , ప్రభుత్వంపై పురి గొల్పే విధంగా భారాస నాయకులు మాట్లాడడం వల్ల రేపు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని కొందరు సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలుస్తామని, ఆరు నెలల్లో కూలిపోతుందని, రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే అంటూ కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి నిరాధార ఆరోపణల పై ఒకవైపు న్యాయ పరంగా, మరోవైపు క్రిమినల్ చర్యలపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బి.అర్.ఎస్. నుంచి ఒకరొక్కరు కాంగ్రెస్, భాజపా వైపు మొగ్గు చూపడం వల్ల భారాస అధిష్టానంలో నైరాశ్యం నెలకొనడం ఫలితమే పొంతన లేని మాటలకు తెగబడుతున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.అంతేకాక, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు, గొర్రెలు,మేకల నిధుల గోల్ మాల్ , 50 కోట్ల రూపాయల దొడ్డిదారి ఫార్ములా”ఇ” చెల్లింపులు, ధరణి పోర్టల్ లోటుపాట్లు, బాహ్య వలయ రహదారి పై టోల్ ప్లాజాల కేటాయింపులో ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడం, ఆయా సమస్యలు, విచారణాల పై ప్రజల దృష్టి మరల్చాదానికే ప్రభుత్వం ఈ పని చేసినా భారాస నేతలు మరో ఆలోచన లేకుండా వ్యూహం ప్రకారం వ్యతిరేక పద్ధతులు అవలంభించాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా అర్ధం అవుతోందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం పై నిరాహార దీక్ష బాగుంటుందనే సూచనను కేటీఆర్ ఆలోచిస్తే ప్రజా ప్రయోజనంగా ఉంటుందని సూచిస్తున్నారు.