అవినీతి పై “విజిలెన్స్”.. “ఈగల్” ఎఫెక్ట్..

IMG 20240311 WA0017 scaled

వైద్య విద్యా శాఖలో బదిలీల్లో జరుగుతున్న అవినీతిపై “ఈగల్ న్యూస్” అందించిన ప్రత్యేక కథనానికి ప్రభుత్వం స్పందించింది. బదిలీల్లో పారదర్శకత పై వస్తున్న అనుమానాలు, అధికారుల అవినీతిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య బదిలీలలో అవినీతికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కూడా సూచించారు. బదిలీలలో అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే వారు ఏ స్థాయి వారైనా కఠిన చర్యలు చేపట్టాలాన్నారు. బదిలీల్లో జరుగుతున్న అక్రమాలపై “ఈగల్ న్యూస్” నిన్ననే అనేక వివరాలతో “బదిలీల్లో “సూపర్” అవినీతి”… అనే శీర్షికతో కథనాన్ని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే కథనం మీ కోసం మరొక్కసారి.

Screenshot 20240726 193957 Gallery

బదిలీల్లో “సూపర్” అవినీతి…

తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొంతమంది అధికారులకు కాసుల పంట పండిస్తోంది. అనేక శాఖల్లో నిబంధనలను తుంగలో తొక్కి దొడ్డిదారి పోస్టింగులకు ద్వారాలు తెరుస్తున్నారు. ఈ అవినీతి భాగోతం వైద్య ఆరోగ్య శాఖలో మితిమీరుతోంది. కొందరు సంఘాల నాయకులుగా చెప్పుకునే కొందరు ఉద్యోగులు, అధికారి కుమ్మక్కై బదిలీల తంతును రచ్చ చేస్తున్నారు. వారం రోజుల కిందట హైదరాబాద్ కోఠి లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ ల బదిలీల గందరగోళం ఒక ఉదాహరణ. అధికారులు, సంఘాల నేతల చేష్టలకు విసిగిపోయిన నర్సింగ్ ఉద్యోగులు అసలు బాగోతాన్ని రోడ్డుకు ఈడ్చారు. బదిలీలలో జరుగుతున్న అక్రమాలను ఎండగడుతూ నడి రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో బదిలీ ప్రక్రియను నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే వైద్య ఆరోగ్య శాఖలో మరో అవినీతి కోణం వెలుగులోకి వచ్చింది. ఇది ఏకంగా ఆసుపత్రులకు ఆక్సిజన్ వంటి వైద్యుల బదిలీల వ్యవహారం. ఏళ్ల తరబడి ఒకేచోట ఉంటున్న వారిని గుర్తించి 40 శాతం మందిని తప్పనిసరి బదిలీ చేయాలనేది ప్రభుత్వ నిబంధన. ఏ శాఖ ఐయినా ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలి. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు తమ పై బదిలీల వేటు పడకుండా పావులు కదుపుతున్నారు. వైద్యవిద్య శాఖలోని కొందరు పై స్థాయి అధికారులు, సంఘాల నాయకులు కలిసి మూడో కంటికి తెలియకుండా వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సుమారు 15 మందికి పైగా సూపర్ స్పెషాలిటీ విభాగాల ప్రొఫెసర్లపై ఇప్పటి వరకు బదిలీల ఊసే లేకపోవడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వారు ఆయా ఆసుపత్రుల్లో తిష్ట వేసి ఉండడం గమనార్హం. ప్లాస్టిక్ సర్జరీ, యురాలాజీ, న్యురాలాజీ, కార్డియాలజీ ఇలా వివిధ విభాగాలకు చెందిన వైద్యులు వైద్య విద్యా శాఖలో పైరవీలు చేసే వారితో పెద్దమొత్తంలో డబ్బు ఏర చూపి బదిలీ వ్యవహారం నుంచి తప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం చెబుతున్నట్టు బదిలీల్లో పారదర్శకత ఉంటే ఈ 15 మంది ప్రొఫెసర్లు కూడా 80 నెంబర్ జీ.ఓ. ప్రకారం తప్పనిసరిగా బదిలీ కావలసిందే అని సీనియర్ వైద్యులు పేర్కొంటున్నారు. దీనివల్ల అర్హత ఉన్న వారికి అన్యాయం జరుగుతోందని, ఈ విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వస్తోంది. ఇదే విషయం పై కొందరు వైద్యులు మంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *