“హైదారాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ” (హైడ్రా) దూకుడు పెంచింది. విమర్శలు, ఆరోపణల మధ్య తన పని తాను చేసుకుపోతోంది. మొన్న గండిపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు, నేడు మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని నటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ ని నేలమట్టం చేశారు. భారీ భద్రత మధ్య హైడ్రా బృందం కూల్చివేత చేపట్టింది. మూడున్నర ఎకరాల చెరువును ఆక్రమించి ఎన్- కన్వెన్షన్ నిర్మించినట్లు ఆరోపణలు రావడం, విచారణలో వాస్తవమని తెలవడంతో కూల్చివేశారు.
ఇదిలా ఉండగా, అక్రమ నిర్మాణాలపై “హైడ్రా” ఉక్కుపాదం మోపడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా మాదిరిగానే ఇతర ప్రభుత్వ శాఖలు కూడా ఇదే తరహా దూకుడుతో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. వ్యక్తులు , పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆయా నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి చెందిన స్థలాలు, చెరువులను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.