పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సింధూర్” పేరిట పాకిస్థాన్, దాని ఆక్రమిత కశ్మీర్‌లో కచ్చితమైన క్షిపణి దాడులు నిర్వహించింది. దీంతో దాయాది దేశం ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులను మూసి వేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు.

పాకిస్థాన్-రాజస్థాన్ మధ్య 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు కలిగి ఉంది. దీనిని పూర్తిగా మూసివేశారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే స్పాట్‌లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉంది. ఫైటర్ జెట్స్ ప్రొటోకాల్ నేపథ్యంలో జోధ్‌పూర్, కిషన్‌గఢ్, బికనీర్‌లో విమానాల రాకపోకలపై ఈ నెల 9 వరకు నిషేధం విధించారు. సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు క్షిపణి రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. గంగానగర్ నుంచి రాణా ఆఫ్ కచ్ వరకు సుఖోయ్-30 ఎంకేఐ జెట్‌లు ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో బికనీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్, బర్మేర్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదావేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది సెలవులు రద్దు చేశారు. అలాగే సరిహద్దు గ్రామాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జైసల్మేర్, జోధ్‌పూర్‌లో అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పూర్తిగా లైట్లను ఆర్పివేయాలని ప్రకటించారు. దీనివల్ల శత్రుదేశం వైమానిక దాడులు చేయడానికి కష్టమవుతుంది.

ఇక, పంజాబ్‌లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. ప్రజలు గుమికూడకుండా నిషేధం విధించారు. బహిరంగ సభలపై ఆంక్షలు విధించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.