జాతీయ పార్టీ అండ చూసుకొని తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచుతున్నారు. ప్రత్యేకించి కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత పెత్తనం కోసం వెంపర్లాడుతున్నట్టు కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమే దీనికి సాక్ష్యం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తనకు కేటాయించిన శాఖలపై కంటే పక్క మంత్రుల శాఖలు, వాటి పనితీరుపై కన్ను వేయడం అంతు పట్టకుండా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో హోమ్ శాఖపై అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ, ఆ శాఖ తన వద్ద ఉంటే తడాఖా చూపించే వాడినని అనడం విస్మయం కలిగించింది. ఈ విషయాన్ని అప్పట్లో ముఖ్యమంత్రి సైతం తీవ్రంగా పరిగణించారు. ఇటు తెలంగాణలో అడుగు పెట్టి ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆవేశ పూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం పవన్ లో కనిపిస్తున్న కొత్త కోణం. మొన్న ఆయన గవర్నర్ ని కలవడం కూడా రాజకీయ చర్చలకు తెరలేపింది.
సామాజిక మాధ్యమాల్లో తనను ఎవరో వేధించడాన్ని దేశ ప్రజల సమస్యగా పవన్ ఆందోళన చెందడం వింతగా ఉందని, అనేక నీతులు చెబుతున్న ఆయన ఒక సామాజిక మాధ్యమ నిర్వాహకుని అరెస్టుకు ఎందుకు కారకులయ్యారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మొన్న పరోక్షంగా మీడియాకు హెచ్చరికలు జారీ కూడా చేశారు. కేంద్రంలో జనసేన పార్టీ అధికారంలో ఉన్నట్టూ అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికీ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని సామాజిక, రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కొత్త చట్టం ఏ స్థాయిలో తీసుకు వస్తారనేది స్పష్టత లేని ప్రకటనగా ఉందని వివరిస్తున్నారు. ఈ మార్పు దేశంలో మార్పు కోసమా, లేక రాష్ట్రంలో మార్పు కోసమా అనేది తేల్చి చెబితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

ఇక, తాజాగా పవన్ ఆంధ్రప్రదేశ్. గవర్నర్ ను కలవడం రాజకీయ చర్చకు దారి తీస్తోంది. గవర్నర్ ను కలిసి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం జరుగుతొందని మొర పెట్టుకున్నట్టు సమాచారం. అయితే, ఆయన వ్యక్తిగత సమస్యపై గవర్నర్ ను కలిశారా లేక ఉప ముఖ్యమంత్రి హోదాలో కలిశారా అనేది రచ్చబండ చర్చల్లో ప్రధాన అంశం. జనసేన అధ్యక్షునిగా కలిస్తే సమస్య లేదు. కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో కలిసి ఉంటే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునీ, హోమ్ మంత్రిని బేఖాతరు చేయడమే అనే వాదనలు గుప్పుమంతున్నాయి. సాధారణంగా ప్రజా సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళి వివరిస్తారు. ఏ రాష్ట్రంలో అయినా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.. కానీ, పవన్ ఏ ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ ను కలిశారనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేస్తున్న పవన్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలనీ పర్యవేక్షించాలి. కానీ, హోమ్ మంత్రిత్వ శాఖ అధీనంలోని విభాగాలతో సమావేశం కావడం మరో చర్చనీయాంశం. సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులతో సమావేశమై “ఈగల్” విభాగం పనితీరుని ఆయన ప్రశంసించడం గమనార్హం.
ఇదిలా ఉంటే, చంద్రబాబు నాయుడు సైతం పవన్ వ్యవహార శైలిని నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతోంది. జనసేన కొంత కాలంగా ఢిల్లీ పెద్దల దృష్టిలో పడే ప్రయత్నాలు చేయడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో బలమైన చర్చకు దారి తీసింది. సేన ఆవిర్భావ దినోత్సవానికి ఢిల్లీని వేదికగా ఎంచుకోవడం, తానూ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్టు సంకేతాలు ఇవ్వడాన్ని టీడీపీ విశ్లేషిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఉంటూ రోజు రోజుకీ సనాతన ధర్మం, హిందూ, దేవతలు అంటూ బీజేపీ భావజాలాన్ని వెల్లడిస్తున్న పవన్ తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబు గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించక పోవడాన్ని రాజకీయ పరిశీలకులు వివిధ కోణాల్లో అంచనా వేస్తున్నారు.
