అంతుపట్టని ఆక్రోశం …!

kasi finl

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణపై పీకల లోతు కోపంతో ఉన్నట్టు కనిపిస్తోంది. వ్యాపారం, సినిమాల కోసమే హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకున్న సంగతి మరచిపోయి తెలంగాణ ప్రాంత అధికార పార్టీ పైన, ప్రభుత్వం పైనా, ఇతర పార్టీల నేతల పైన ఆయన నిప్పులు చెరుగుతున్నారు. మొన్నటి వరకు కెమెరాకు మాత్రమే పరిమితం అయి, సినిమా వేషాలు చూపించిన పవన్ ఆంధ్రలో చంద్రబాబు పంచన చేరి బిజెపి సిఫారసు మేరకు అక్కడ మంత్రి పదవి దక్కించుకున్న వాస్తవాన్ని ఆయన గ్రహించక పోవడం విచిత్రం. ఆయన ఏదో తెలంగాణకు చెందిన వారైనట్టు, ఉద్యమంలో వీరోచితంగా పోరాడినట్టు, పొంతన లేని, వాస్తవ విరుద్ధమైన ప్రసంగాలు చేయడం రాజకీయ పరిశీలకులను విస్మయపరుస్తోంది. రెండు వారాలుగా తెలంగాణ గడ్డపై జరిగిన అవమానంతో రెండు వారాలుగా రగిలిపోతున్న ఆయన తాను దేశంలో ఎక్కడైనా తిరుగుతా అని చూపడానికి సినిమా ఫక్కీలో పథకం వేశారు. పార్టీ ఆవిర్భావదినాన్ని సాకుగా ఎంచుకొని, ఆంధ్రాలో నిర్వహించాల్సిన సమావేశాన్ని ఢిల్లీలో చేపట్టే ప్లాన్ వేశారు. పార్టీ ప్రారంభం రోజున  “చేగువేరా” ప్రతిరూపాన్ని అంటూ పిడికిలి బిగించి విప్లవ ప్రసంగం చేసిన అధినేత, పుష్కర కాలంలోనే ఒక్కసారిగా సనాతనం, సామరస్యం అంటూ ఢిల్లీ వేదికపై ప్రసంగించిన తీరు విడ్డూరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ లో జరిగిన పరాభవాన్ని జీర్ణించుకోలేని పవన్ తాను దేశంలో ఎక్కడైనా తిరుగుతా అనే సందేశం ఇవ్వడానికి ఏకంగా దేశ రాజధానిని లక్ష్యంగా ఎంచుకున్నారు. అందుకే పుష్కర కాలం పూర్తీ చేసుకున్న సందర్భంగా నిర్వహించే జనసేన పార్టీ సమావేశానికి తెలివిగా బిజెపి అధికారంలో ఉన్న ఢిల్లీని వేదికగా మలచుకున్నారు. వాస్తవంగా ప్రాంతీయ పార్టీ వేడుకను సొంత రాష్ట్రంలో కార్యకర్తల మధ్య జరుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా బయట రాష్ట్రాల్లో ఇలాంటి వింత సమావేశాలు పెట్ట లేదు. మొన్న  హైదరాబాద్ లో సమావేశానికి పోలీసులు నిరాకరించడాన్ని జనసేన పార్టీ కార్యకర్తలకంటే కూడా పవన్ వ్యక్తిగతంగా తీసుకున్నట్టు తేలిపోతోంది.

pawan del team

అందుకే ఆ రోజు విలేకర్ల సమావేశం నిర్వహించి తన అక్కసు వెళ్లగక్కున్నారు. తను తెలంగాణా బిడ్డ కాదన్న సంగతీ, తన వ్యాపార, సినీ వ్యవహారాలు ఈ ఉద్యమ గడ్డపైనే ఉన్నాయనే ప్రధానమైన  అంశాన్ని గుర్తుచేసుకోకుండా    రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విరుసుకు పడ్డారు. ఆ రోజు నుంచి ఆయన దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో సేన సమావేశం పెట్టి తీరాలని కసిగా ఉన్నట్టు జనసేన వర్గాల ద్వారానే తెలుస్తోంది. దీనికి పార్టీ కి  12 సంవత్సరాలు నిండడాన్ని అవకాశంగా మలచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి దక్కేలా గెలిపించిన  అక్కడి జనం మధ్య ఈ “పుష్కర సభ” నిర్వహించాల్సి ఉంది. కానీ, ఢిల్లీలో సమావేశం పెట్టడానికి మరో అవకాశం రాదు కాబట్టి ఈ సభకు, తన పంతం చూపించడానికి ఢిల్లీనే అడ్డగా ఎంచుకున్నారు. దేశంలో సమగ్రత, సమైక్యత, ప్రాంతీయతకు ఇప్పుడేదో భంగం కలిగినట్టు “పవనిజం” ఆందోళన చెందడం ఆశ్చర్యం కలిగించే దృశ్యం. ఇక మోడీ 12 ఏళ్ల పాలనను పొగడడం, ఆయన్ని వీరుడు,శూరుడు అంటూ పైకెత్తడం, తెలంగాణలో సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఖండించడం, ఏ రాష్ట్రంలోనైనా సమావేశాలు పెట్టుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని ప్రచారం చేయడం ఢిల్లీ “జనసభ”  కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *