ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అతి తెలివైన వ్యక్తి, కంటే, అత్యంత తెలివి తక్కువ నాయకుడు ఎవరనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. అగ్ర రాజ్యం అధినేత ట్రంప్ వ్యవహారం “పులిని చూసి నక్క వాత” పెట్టుకున్నట్టు ఉందనే వాదనలు గుప్పుమంటున్నాయి. 35 ఏళ్ల కిందట అప్పటి అమెరికా అధ్యక్షుడు ఇరాక్ పై యుద్ధం చేసినట్టు, ఇప్పుడు ఇరాన్ పై ట్రంప్ కయ్యానికి దిగడం ఆయన అనాలోచిత విధానానికి అద్దం పడుతుందనే బలమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు అమెరికా రహస్య సంస్థ (సి.ఐ.ఎ.) కి చెందిన ప్రస్తుత, మాజీ అధికారులే ట్రంప్ తొందరపాటును వేలెత్తి చూపడం సిగ్గుచేటు. ఇది ఆయన రాజకీయ, దౌత్య అజ్ఞానానికి నిలువుటద్దం. సహజంగా పొరుగున ఉన్న రెండు ఇళ్ల యాజమానుల మధ్య గానీ, దాయాది దేశాల మధ్య గానీ అనేక విషయాల్లో గొడవలు రావడం సహజం. ఈ వాస్తవం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆరితేలిన ట్రంప్ కి తెలియనిది కాదు. “సరైన సమయంలో సరైన నిర్ణయం” అనే ప్రాధమిక సూక్తి తెలియకుండా అమెరికా అధ్యక్షునిగా రాణించడం నిజంగా సభ్య సమాజం ఆలోచించాల్సిన విషయం. ఇరాన్ పై వ్యూహం లేకుండా రణరంగం లోకి దూకిన ట్రంప్ దూకుడు అగ్రరాజ్యం పరువు తీస్తున్న ఈ సందర్భంగా 1991లో ఇరాక్ పై అమెరికా జరిపిన “ఆపరేషన్ డిజాస్టర్ స్ట్రామ్” ని ఒక్కసారి అవలోకనం చేసుకోవలసిన అవసరం ఉంది.
రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఆది నుంచీ వింత పోకడలకు తెర తీస్తున్నారు. ఆ దేశ ఆర్థిక అంశాల్లో గానీ, విదేశీ విద్యా విధానంలో గానీ విఫలయత్నాలు చేయడం అందరికీ తెలిసిన సంగతే. చైనా, రష్యాలతో పాటు భారత్ విధి,విధానాల్లోనూ ట్రంప్ వేలు తన తుంటరి తనాన్ని చూపే ప్రయత్నం చేశారు. చివరకు ఆ దేశ న్యాయ వ్యవస్థలో సైతం తమ పెత్తనం చెలాయించాలనే ఆలోచన అమెరికా అధినేతకు ఆహానికి సాక్ష్యం . ఇక భారత్, పాక్ వివాద సమయంలోనూ “ఆపరేషన్ సింధూర్” ఆగిపోవడానికి తానే మధ్యవర్తిత్వం చేసినట్టు చెప్పుకున్న సందర్భమూ ప్రపంచ దేశాలు ఇప్పటికీ మరచిపోలేని ట్రంప్ భాగోతం. ఇవ్వన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య ఉన్న అంతర్గత వ్యవహారాలకు ఆజ్యం పోసి అకారణంగా తన సమస్యను ప్రపంచ దేశాల సమస్యగా మార్చిన ట్రంప్ నిర్ణయం ఆయన దుందుడుకు స్వభావానికి సాక్ష్యం. 1990 ఆగస్టు 2న, సద్దాం హుస్సేన్ పాలనలో ఉన్న ఇరాక్, పొరుగున ఉన్న కువైట్‌పై దాడి చేసి రెండు రోజుల్లోనే ఆ దేశాన్ని ఆక్రమించుకుంది. రిపబ్లిక్ ఆఫ్ కువైట్ అనే పేరుతో ఒక తాత్కాలిక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత , ఇరాక్ కువైట్ భూభాగాన్ని విభజించి, ఉత్తర భాగాన్ని బస్రా గవర్నరేట్‌లో విలీనం చేసి , దక్షిణ భాగంలో కువైట్ గవర్నరేట్‌ను స్థాపించింది. దీంతో కువైట్ పై దాడిని అంతర్జాతీయంగా వెంటనే ఖండించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇరాక్ తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో కువైట్ నుండి వచ్చే ఉత్పత్తులపై ఇరాక్ పూర్తి ఆంక్షలు విధించింది. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ రంగంలోకి దిగారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సైనిక సమీకరణను ప్రారంభించారు. బ్రిటన్, ఈజిప్ట్ దేశాలు ప్రధాన సహకారులుగా ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద సైనిక కూటమి. ఇరాక్‌కు కువైట్ నుండి వైదొలగాలని భద్రతా మండలి 1990 నవంబర్ 29న అల్టిమేటం జారీ చేసింది , దాని గడువు 1991 జనవరి 15. ఆ తర్వాత, వైదొలగేలా బలవంతం చేయడానికి “అవసరమైన అన్ని మార్గాలను” ఉపయోగించుకునే అధికారాన్ని సభ్య దేశాలకు ఇచ్చింది. జనవరి 17న, సంకీర్ణ దళాలు ఇరాక్ పై వైమానిక, నావికా దాడులను ప్రారంభించాయి, ఈ దాడులు ఐదు వారాల పాటు హోరాహోరీగా సాగాయి. ఇరాక్ ఇజ్రాయెల్, సౌదీ అరేబియాపై క్షిపణులను ప్రయోగించింది , కానీ ముస్లిం-మెజారిటీ దేశాలను సంకీర్ణం నుండి విడగొడుతుందని ఆశించిన ఇజ్రాయెల్ సైనిక ప్రతిస్పందనను రెచ్చగొట్టడంలో విఫలమైంది. 1991 ఫిబ్రవరి 24 వ తేదీన, సంకీర్ణ దళాలు కువైట్‌ను విముక్తి చేస్తూ ఒక నిర్ణయాత్మక భూతల దాడిని ప్రారంభించి, వెంటనే ఇరాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి. వంద గంటల తర్వాత సంకీర్ణ దళాలు తమ భూతల ముందడుగును నిలిపివేసి, కాల్పుల విరమణను ప్రకటించాయి. అప్పట్లో ఇరాక్ దుశ్చర్యకు పొరుగు దేశాలు కూడా సఖ్యతతో తిరగబడడంతో బుష్ వ్యూహం ఫలించింది.
అమెరికా పరువు తీసిన “టెంపర్”
కానీ, ఇప్పుడు ఇరాన్- ఇజ్రాయిల్ వివాదంలో “గుడ్డెద్దు” గుంపులో దూరినట్టు ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం ఇరాన్ పై ఒక్కసారిగా విరుసుకు పడడం ప్రస్తుత సమస్యకు మూలం. అప్పట్లో బుష్ అనేక కారణాలతో ఇరాక్, సద్దాం హుస్సేన్ వెంట బడితే, ఇప్పుడు ఏ కారణం చూపకుండానే ట్రంప్ ఇరాన్ పై పోరుకు దిగడం అంతుపట్టని విషయం. సొంత గడ్డ నుంచే వ్యతిరేకత రావడం మరీ దారుణం. ఇరాన్ ను రెచ్చగొడితే పక్కన ఉన్నా తన స్థావరాలకు ముప్పు ఉంటుందనే అంచనా వేయడంలో అమెరికా ఘోరంగా విఫలమైంది. అంతేకాదు, సముద్ర మార్గంలోని హార్మూజ్ జల సంధి ప్రాధాన్యత సైతం ట్రంప్ కి తెలియదనేది ఈ రోజు ప్రపంచ దేశాల ఓడలు అక్కడ నిలిచిపోవడంతో స్పష్టం అయింది. ఈ జల సంధి ప్రాముఖ్యత పై అవగాహన పెంచుకున్న ట్రంప్ 48 గంటల్లో హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని, లేకుంటే విద్యుత్ కేంద్రాలపై విరుసుకు పడతామని ఈ నెల 22న అల్టిమేటం ఇచ్చిన ట్రంప్, 24 గంటలు తిరగ కుండానే తన అల్టిమేటంకి తానే 5 రోజులు అల్టిమేటం విధించుకున్నాడు. ఇదే ట్రంప్ ప్రపంచ దేశాల్లో చులకనగా మారడానికి, అగ్రరాజ్యంగా వెలుగుతున్న అమెరికా అభాసుపాలు కావడానికి తెర లేపింది. ఒంటెత్తు పోకడతో పశ్చిమ ఆసియాలో మంటలు రేపిన ట్రంప్ ఇజ్రాయిల్ కి వంత పాడుతూ ఆ సెగల నుంచి ఎలా బయట పడతారో వేచి చూడాలి. అంతేకాదు, దీని ఈ అనాలోచిత రభస వల్ల అమెరికా ఏమి సాధిస్తుందనేది కూడా ఆసక్తికర అంశం. ఒకవిధంగా చెప్పాలంటే అగ్రరాజ్యానికి ఈ తలా,తోక తెలియని యుద్ధం మాయని మచ్చలా మిగిలిపోక తప్పదు.
