పశ్చిమ ఆసియా యుద్ద మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. పంతం వీడని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ససేమిరా అంటున్న ఇరాన్ సైన్యం విధ్వంసక వ్యూహాలు యుద్ధం తీవ్ర రూపం దాల్చే దిశగా తీసుకువెళ్తున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు 4 8గంటల గడువు విధించారు. లేకుంటే ఇరాన్ విద్యుత్ ప్లాంట్స్‌ను తుదముట్టిస్తామని, ముఖ్యంగా అతి పెద్దదైన విద్యుత్ కేంద్రంతోనే ఆ పని మొదలుపెడతామని హెచ్చరించడం ఆందోళనకు గురిచేస్తోంది . “ఎటువంటి బెదిరింపులు, డిమాండ్ లు లేకుండా హార్ముజ్ జల మార్గాన్ని సంపూర్ణంగా తెరిచేందుకు 48గంటల సమయం ఇస్తున్నాం’’ అని ట్రంప్ తన ”ట్రూత్ సోషల్”లో పోస్టు చేశారు. అంటే ఇరాన్‌కు ట్రంప్ ఇచ్చిన గడువు మార్చి 24 ఉదయం 3 గంటల 14 నిమిషాలతో ముగుస్తుంది. (భారత కాలమానం ప్రకారం మార్చి 24వ తేదీ ఉదయం 5 గంటల14 నిమిషాలు).

కానీ, ట్రంప్ అల్టిమేటమ్ కి ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. ఇరాన్ చమురు, విద్యుత్ స్థావరాలపై దాడులు జరిగితే, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికాకు చెందిన ఇంధన స్థావరాలను ఇరాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంటుందని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. దీన్నిబట్టి మంగళ వారం ఉదయానికి గాని పంతాల డ్రోన్లు, మిసైళ్ళు ఎటు దూసుకు వెళ్తాయో వేచి చూడాలి.
