దేశంలో చారిత్రాత్మక ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలో “సనాతన దొంగలు” పడ్డారు. వీళ్ళు దొంగిలించింది సామాన్య జనం సొమ్ము కాదు సాక్షాత్తూ నీల మేఘ శ్యాముడైన శ్రీరాముని సొత్తు. అందుకే ఈ ముఠాను “ఈగల్ న్యూస్” సనాతన దొంగలుగా పరిగణిస్తుంది. దేశం మొత్తాన్ని హిందూ ధార్మిక సంస్థగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నానా ప్రయత్నాలు చేస్తూ సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, ఇంకో వైపు కొందరు సనాతనం ముసుగు వేసుకొని ఇలా దొంగతనాలకు పాల్పడడం వింత పరిణామం. ఆలయ ఉద్యోగులే దొంగలుగా మారి కోట్ల రూపాయల విలువ చేసే స్వామి వారి సంపదను దోచుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో చోటుచేసుకున్న ఈ సనాతన దొంగల ముఠా వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. మందిరంలో హుండీ డబ్బును, ఇతర కానుకలను కాజేశారు. అంతేకాదు, మసీదుని కూల్చివేసి రామ మందిరాన్ని నిర్మించాలానే సంకల్పంతో 90వ దశకంలో కొందరు కరసేవకులు ఇటుకలను అయోధ్యకు చేర్చిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రాముఖ్యత ఉన్న ఇటుకలను కూడా ఈ దొంగలు స్వాహా చేశారు. అయితే, ఇవి మట్టి ఇటుకలు కాదు ఓ సంపన్న వర్గం స్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చిన వెండి ఇటుకలు కావడం విశేషం. ఆ వివరాలు ఒకసారి మీ కోసం.

అయోధ్య రామ మందిరంలో కానుకలు, ఇతర సామాగ్రి దుర్వినియోగానికి సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి పవన్ పాండే ఈ నెల ఏడో తేదీన బలమైన ఆరోపణలు చేశారు. రామమందిరంలోని హుండీలు, కానుకల రూపంలో వచ్చిన మొత్తంలో సుమారు 5 నుంచి 8 కోట్ల రూపాయల మేరకు చోరీ జరిగిందని తెలిపారు. అదే రోజు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఆరోపణలకు మద్దతుగా ప్రకటన చేశారు. అయితే, రామమందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, ట్రస్ట్ వద్ద పూర్తి రికార్డులు ఉన్నాయని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. పదో తేదీన ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయం (పిఏం ఓ) సమగ్ర నివేదిక కోరింది. అదే రోజు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా అయోధ్యకు చేరుకుని ట్రస్ట్ సీనియర్ సభ్యులతో నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. 11 వ తేదీన రామ మందిర ట్రస్ట్ మాజీ అకౌంటెంట్ మహిపాల్ సింగ్ విడుదల చేసిన వీడియో సంచలనం రేపింది. 2021–22లోనే ఆర్థిక అక్రమాలను గుర్తించానని పేర్కొన్నారు. అనంతరం ఆ వీడియోను తొలగించడం గమనార్హం. ఇక ఈ దొంగతనాల నిగ్గు తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటుద చేసింది. 15వ తేదీన ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు గోపాల్ రాయ్ నుంచి వివరాలు సేకరించింది. 16వ తేదీన కూడా సిట్ విచారణలో భాగంగా చంపత్ రాయ్, గోపాల్ రాయ్‌లను ఒక్కొక్కరిని సుమారు నాలుగు గంటల పాటు విచారించింది. సుమారు ఏడాది పాటు ట్రస్ట్ ఆర్థిక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించింది.
17వ తేదీన నోట్ల లెక్కింపులో పాల్గొన్న ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులు, బ్యాంకు అధికారులను సిట్ విచారించింది. తిరిగి 19వ తేదీన చంపత్ రాయ్, డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్ రాయ్‌లను సిట్ విడివిడిగా విచారించింది. అదే రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్, క్యాషియర్‌లను కూడా ప్రశ్నించింది. 23వ తేదీన సిట్ 20 పేజీల ప్రాథమిక విచారణ నివేదికను హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్ కు అందజేసింది. హుండీ ఆదాయం లెక్కింపు సమయాల్లో భారీ అవకతవకలు జరిగినట్టు సిట్ గుర్తించినట్టు సమాచారం అందుతోంది. విరాళాల లెక్కింపు సమయంలో ఆలయ ఉద్యోగులు నగదును అక్రమంగా స్వాహా చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్టు కనుగొన్నారు. దీని ఆధారంగానే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరఫున ట్రస్ట్ సభ్యులు కృష్ణ మోహన్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. మందిరంలో నిధుల దుర్వినియో గానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఎనిమిది మందిని కస్టడీలోకి తీసుకున్నామని, వారిలో ఆరుగురు ఆలయ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. వీరి దొంగతనం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సనాతన నిధుల దొంగతనంలో బయటి వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే మరిన్ని అరెస్టులు ఉండొచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, రుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, శ్రీ రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ లను అరెస్టు చేసినట్టు అయోధ్య పోలీసులు వివరించారు. వీళ్లలో ఆరుగురు ఆలయ ఉద్యోగులు కావడం విశేషం.
మరి ఇటుకల సంగతి?
ఇదిలా ఉంటే, 2021వ సంవత్సరంలో స్వామి వారికి కానుకగా ఇచ్చిన 2 కోట్ల రూపాయల విలువ చేసే 200 వెండి ఇటుకల సంగతి ఏమిటని “సింధీ సమాజం” నిలదీస్తుంది. వివిధ దేశాల్లో ఉన్న సింధీలు ఒక్కొక్కరు ఒకటి నుంచి పది ఇటుకల వరకు వెండి ఇటుకలను ఆలయ ట్రస్టీకి అందజేశారు. వాటికి సంబంధించిన పూర్తీ వివరాలు బయట పెట్టాలని “ప్రపంచ సింధు సమాజం” డిమాండ్ చేస్తోంది.
