అధికారంతో పెత్తనం చెలాయించడం వేరు, అహంకారంతో విర్ర వీగడం వెర్రితనం. రాజు ముందు నడుస్తూ రాజ్యా విస్తరణకు పూనుకోవడం సామ్రాజ్యవాదుల లక్ష్యంగా ఉంటుంది. శత్రు గణం పీచమోలచాలి అంటే అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో మాత్రమే కదన రంగంలోకి అడుగు పెట్టాలి. వీరుడని జేజేలు కొట్టించుకోవాలి. నాయకుడూ అతనే, నిజమైన రాజు అయినా అతనే. కానీ, తలాతోకా లేని నిర్ణయాలతో అకారణంగా పశ్చిమ ఆసియా దేశాల్లో తలదూర్చి ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అభాసుపాలు అయింది. ప్రపంచ దేశాలకు “పెద్దన్న”గా వ్యవహరించాల్సిన అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ “పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు” ఎప్పుడో ఐదు దశాబ్దాల కిందట జపాన్ పై పోరాడినట్టు ఇప్పుడు ఇరాన్ పై తన ఆధిపత్యం చెలాయించాలనీ, ఆ విజయంతో చరిత్రలో నిలిచి పోవాలనే మొండి ఆలోచనతో ట్రంప్ ఇరాన్ పై అనాలోచితంగా కయ్యానికి కాలు దువ్వారు. కానీ, తన పొరుగు దేశం కాని సుదూర దేశం పై యుద్ధానికి దిగడానికి ముందు ఆ దేశానికి పొరుగున ఉన్న దేశాల్లో ఏ దేశం తనకు సైనిక స్థావరం (బేస్) ఇస్తుంది అనేది చాలా కీలకం. ఈ ఒక్క సహజ యుద్ధ వ్యూహాన్ని ట్రంప్, అమెరికా సైన్యం తేలికగా తీసుకుంది. ఒక్క ఇజ్రాయిల్ , సౌదీ, పాకిస్తాన్ మినహా అమెరికా సైనానికి, ఆ దేశ యుద్ధ విమానాలు దిగడానికి ముందుకు రాలేదు. అదే, అప్పట్లో ఇరాక్ కువైట్ ను అక్రమించుకున్నప్పుడు సద్దాం హుసేన్ చర్యకు వ్యతిరేకంగా బ్రిటన్ సహా అనేక దేశాలు అమెరికా దళాలకు, వాటి చర్యలకు మద్దతు పలికాయి. బేస్ లు ఇచ్చాయి. కానీ, ఇప్పుడు ఒక్క రాత్రిలో ఇరాన్ నాగరికత రాతి యుగంలోకి వెళ్తుంది అంటూ మంగళవారం అగ్ర రాజ్య అధినేత ట్రంప్ జారీ చేసిన అనాలోచిత, అసహన ప్రకటన యావత్ ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ తన ఆవేశం, అసహనం, అహంతో కొన్ని గంటల పాటు ప్రపంచ దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తాను అనడం నిజంగా అంతర్జాతీయ నేరం.
దమ్ము, ధైర్యం, సత్తా, యుద్ధ వ్యూహం ఉంటే కేవలం ఇరాన్ పాలకులు, ఎదురు పడే సైన్యం పై ట్రంప్ సైన్యం పోరాడాలి. కానీ, రాజనీతి, యుద్ధ నీతి తెలియని ట్రంప్ కేవలం అయోమయ స్థితిలో అసహనం చూపుతూ ఏకంగా ఇరాన్ ప్రజలనే మట్టు బెట్టాలని నిర్ణయించడంతో ప్రపంచ ఆగ్రహాన్ని చవిచూశారు. ట్రంప్ యుద్ధ సమరం మోగిన వెంటనే బ్రిటన్ స్పందించింది. అమెరికా సైన్యానికి తమ దేశంలో స్థావరం ఇవ్వబోమని గంటల వ్యవధిలోనే ప్రకటించింది. దీంతో అమెరికాకు ఒక్క పాకిస్తాన్ మాత్రమే దిక్కుగా మిగిలింది. దీన్నే అదునుగా చేసుకొని పాకిస్తాన్ రాత్రికి రాత్రే నక్క జిత్తులతో అటు ఇరాన్ ను ఒప్పించి, తెలివి తక్కువ ట్రంప్ ఆలోచన విధానాన్ని మార్చింది. ఇరాన్ ప్రతిపాదించిన పది అంశాలను రాత్రికి రాత్రే ట్రంప్ అంగీకరించేలా చేసింది. అందులో ట్రంప్ ఎగసి పడుతున్న హర్ముజ్ జల సంధి అంశం కీలకమైంది. ఈ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గలేదు. అస్సలు తగ్గేదే లేదని స్పష్టం చేసింది.
ముంచిన ట్రంప్ అహం ..
అకారణంగా తన దేశం పై దాడులకు పాల్పడడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి, దెబ్బతిన్న ఆస్తులను పునర్నిర్మించుకోవడానికి హర్ముజ్ జలసంధి వద్ద టోల్ చార్జీలు వసూలు చేస్తామనేది అత్యంత కీలక ప్రతిపాదన. దానికి అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తాం అంటూ 15 రోజుల పాటు ట్రంప్ ఆవేశాన్ని అణచివేసిందంటే ఒక విధంగా అగ్ర రాజ్యం యుద్ధంలో వెనుకడుగు వేడినట్టే అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇరాన్ యుద్ధంతో పరువు తీసుకున్న అమెరికాలో ఇప్పుడు కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. అమెరికా అధ్యక్ష స్థానం నుంచి ట్రంప్ ని తొలగించాలని సుమారు 80 మంది ఆ దేశ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అమెరికా పరువు తీసిన “టెంపర్” ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, అగ్రరాజ్యం పరువు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. దేశాన్ని నడపడం అంటే స్థిరాస్తి సంస్థను అడిపినంత సులువు కాదనే వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. 15 రోజుల యుద్ధ విరామం అని చెప్పిన ట్రంప్ ఇరాన్ పరిస్థితిపై గంట,గంటకు పొంతనలేని ప్రకటనలు జారీ చేయడం రాజకీయ, సామాజిక పరిశీలకులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ విధుల్లోకి ఎక్కిన అగ్రరాజ్య యుద్ధ వైఫల్య ప్రభావం రేపటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచిచూడాల్సిన ఆసక్తికర అంశం..
