కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నా చేరికలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చేరికలు సామాన్యమైనవి కావన్నారు. . తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేతుల కలయిక అని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందన్నారు. అందుకే ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశలను సీఎం కేసీఆర్ కాలరాశారని ఆరోపించారు. పొంగులేటితో పాటు ఇతర నేతల చేరిక, కలయిక తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ వనరులను కబ్జా చేశారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇతరులకు ప్రయోజనం చేకూర లేదన్నారు. రాజకీయ ప్రయోగశాలలో తెలంగాణను వేదికగా మార్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పొంగులేటి, జూపల్లిని కలిశామని, అలాగే పార్టీలోకి ఇద్దరినీ ఆహ్వానించినట్టు రేవంత్ తెలిపారు. పార్టీలో చేరికపై పొంగులేటి, జూపల్లి నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమై, ఖమ్మంలో కనీవిని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.