సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట్, పేట్ బషీరాబాద్ లోని 70 ఎకరాల స్థలం జేఎన్‌జే సొసైటీకే చెందుతుందని, ఈ భూమి కోసం సభ్యులందరూ డబ్బులు చెల్లించినందున ఆ భూమికి జేఎన్‌జే సొసైటీ సభ్యులే యజమానులని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు. టీమ్ జేఎన్‌జే ఆధ్వర్యంలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జేఎన్‌జే సొసైటీ సభ్యులకు మాత్రమే ఈ స్థలాలు చెందుతాయని, ఇందులో మధ్యవర్తిత్వం అవసరమే లేదని స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినట్లయితే ఈ స్థలాలు జేఎన్‌జే సొసైటీకి అప్పగించాల్సిందేనని అయన చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన అప్పటి మార్కెట్ ధర ప్రకారంగా రూ.12.33 కోట్లు చెల్లించి సొసైటీ సభ్యులు కొనుగోలు చేయడం, దానిపైనే సుప్రీం తుదితీర్పు అనే ఆయుధాలతో భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకునే హక్కు కలిగించిందని జస్టిస్ చంద్రకుమార్ వివరించారు. ఒకవేళ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయని పక్షంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు తలుపు తట్ట వచ్చని ఆయన సూచించారు. జేఎన్‌జే సొసైటీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సుస్పష్టంగా ఉందని, ఈ స్థలాల్లో మూడోపార్టీ జోక్యం లేదని తీర్పులో స్పష్టంగా ఉందని చెప్పారు. సభ్యులు ఈ స్థలాలను డబ్బులు పెట్టి కొన్నందున ఈ స్థలాలపై సర్వ హక్కులు వారికే చెందుతాయన్నారు. ప్రభుత్వ వర్గాలు ఈ స్థలాలను అప్పగించని సందర్భంలో ప్రజాస్వామ్యయుతంగా నిరహారదీక్షలు చేయాలని సూచించారు. ఆ దీక్షల్లో తానూ కూడా పాల్గొంటానని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ రామచంద్ర రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థలాలను జేఎన్‌జే హౌసింగ్ సొసైటీకి అప్పగించాలని అన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించని సందర్భంలో సొసైటీ సభ్యులకు కోర్టుల్లో న్యాయ సాయంతో పాటు అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. సభ్యులు రూ.2 లక్షల చొప్పున రూ.12.33 కోట్లు ప్రభుత్వానికి చెల్లించినందున 70 ఎకరాల స్థలం జర్నలిస్టులకే చెందుతుందని అన్నారు. తీర్పు ప్రకారం పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి స్వాధీనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జేఎన్‌జే సొసైటీ వ్యవస్థాపక సభ్యుడు పీ వీ రమణారావు మాట్లాడుతూ స్థలాల సాధనకు న్యాయ పరమైన చర్యలు తీసుకుంటున్నామని, కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే నిరసనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, రిలే నిరాహార దీక్షల ద్వారా ఆందోళన ఉధ్రుతం చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమ సొసైటీకి పేట్ బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలం ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడం వల‍్ల సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు.