గత ఎన్నికల్లో పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి టివిలు, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులపై ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన కీలక వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి ప్రకటనలు ఇవ్వడానికి రూ.100 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కమిటిలో మార్పులకు జరుగుతున్నా కసరత్తు వాస్తవమే అన్నారు. 10 ఏళ్లుగా కష్ట పడుతున్న తనకు ఈ మార్పులో శాసన సభ పక్ష నేతగా, లేదా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు అప్పజెప్పాలని అధిష్టానాన్ని కోరారు. తెలంగాణాలో బిజెపి శాసన సభాపక్ష నేత లేడనే విషయం జాతీయాధ్యక్షుడు నడ్డాకు తెలియదనని చెప్పారు. సేవకు ప్రతిఫలం దక్కకపోతే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణాలో బీజేపీ గుర్తు చూసి ఎవరూ ఓటు వేయరని, ఈటల, రఘునందన్ బొమ్మలుంటేనే బీజేపీకి ఓట్లు పడతాయని వ్యాఖ్యానించారు. దుబ్బాకలో తన విజయం చుసిన తర్వాతే ఈటెల రాజేందర్ బిజెపి లోకి వచ్చారని వెల్లడించారు. రాష్ట్ర నాయకత్వ మార్పు జరిగితే అది బండి సంజయ్ స్వయంకృతాపరాధమే అన్నారు. రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.