ఆ మోజులో పడీ…

swarna

ఈ అధికారి గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏదో సినిమాల్లో వినోదం కోసం రచయితలు పాత్రలను సృష్టిస్తారు. అది అంతవరకే పరిమితం. కానీ, అలాంటి కధలనే స్ఫూర్తిగా తీసుకుందో ఏమో ఈ మహిళా పోలీస్ ఏకంగా మాయల ముఠాకే నాయకురాలైంది. అదీ ఎక్కడో కాదు, సాగరతీరం  విశాఖ పట్నంలో అంటే ఆశ్చర్యం కలుగుతుంది. యూనిఫామ్ ముసుగేసుకొని  కొంత కాలంగా రకరకాల దండాలకు పాల్పడుతున్న ఆమె బండారం బయటపడింది. ఏకంగా ఓ దోపిడీ ముఠానే నడుపుతున్నట్లుగా వెల్లడైంది.  ఈమె విషయం తెలిసి ఆంధ్రప్రదేశ్  పోలీసు శాఖ విస్తుపోతోంది.  ఆంధ్రప్రదేశ్ పోలీసు ఆఫీసర్స్ సంఘానికి ఉపాధ్యక్షురాలు, విశాఖ  హోమ్ గార్డ్స్ సీఐగా పని చేస్తున్న స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో దొరికిపోయింది. విశాఖలోని  గాజువాక ప్రాంతానికి  చెందిన విశ్రాంత నేవీ ఉద్యోగులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లకు వి.సూరిబాబు అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ నోట్ల మార్పిడికి సంబంధించి ఆశ చూపాడు.  రూ. 90 లక్షలు  500 నోట్లు ఇస్తే  కోటి రూపాయల 2 వేల నోట్లు ఇస్తామననీ, దీంతో రూ. 10 లక్షలు మిగులుతుందని ఆశ చూపాడు. ఈ డీల్ కి ఒప్పుకున్నా వారిద్దరూ గురువారం రాత్రి సీతమ్మధారలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వద్దకు డబ్బుతో చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సూరిబాబు వారి వద్ద డబ్బు చూసి తర్వాత ఆ విషయాన్ని ఎవరికో ఫోన్ చేసి చెప్పాడు. కొన్ని నిమిషాల్లోనే సీఐ స్వర్ణలత, ఆమె డ్రైవర్ కానిస్టేబుల్ హేమసుందర్ అలియాస్ మెహర్, హోంగార్డు శ్రీను అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో శ్రీను, శ్రీధర్ వద్ద నున్న డబ్బు చూసి బెదిరించి 12 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానని చెప్పడంతో ఆందోళన చెందిన్ ఆ ఇద్దరూ అడిగినంతా ఇచ్చేసి వెళ్లిపోయారు. అయితే, డబ్బు చూసిన వెంటనే సూరి ఎవరికో ఫోన్ చేయడంపై  అతడే ఈ నాటకం ఆడాడని అనుమానించిన బాధితులు డీసీపీ విద్యాసాగర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ఏ1గా సూరిని, హోంగార్డు శ్రీను, డ్రైవర్ మెహర్‌లను ఏ2, ఏ3లుగా చూపించారు. ఏ4గా స్వర్ణలతను పేర్కొన్నారు. స్వర్ణలత డైరెక్షన్ లోనే శ్రీను, మెహర్ లు ఈ వ్యవహారంలో మున్డున్నట్టు వెల్లడైంది. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. స్వర్ణలత ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సినిమాలపై ఆసక్తి పెంచుకున్న స్వర్ణలత ఇటీవల ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె హీరోయిన్‌గా “ఏపీ 31 నంబర్ మిస్సింగ్” పేరుతో ఓ సినిమా నిర్మించేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *