మణిపుర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన సిగ్గుచేటని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ సంఘటన ఆశయంత హేయమైనదని అన్నారు. సమాజంలో ఇలాంటివి చోటుచేసుకోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులను కోరారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ సమావేశాల గురించి మాట్లాడుతూ ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభ్యులంతా సహకరించాలన్నారు. అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చలు జరగాలని కోరుకుంటున్నట్టు, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు తగిన సమయం దొరుకుతుందనే ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.సభలో ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు బిల్లులు ప్రవేశపెడుతున్నట్టు, ముఖ్యమైన బిల్లులపై చర్చించేందుకు ఈ సమయం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.