మణిపూర్ లో జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేసింది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన దృశ్యాలు, కథనాల ఆధారంగా మణిపూర్ ఘటనను “సుప్రీం” సుమోటాగా స్వీకరించింది. ఆ వీడియో దిగ్భ్రాంతికి గురి చేసేదని సీజేఐ నేతృత్వం లోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మే 3వ తేదీన ఈ ఘటన జరిగిందనే సమాచారం అందుతోంది, అలాంటప్పుడు ఇంత కాలం ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మీకు మరికొంత సమయం ఇస్తున్నాం, ఈ లోపు చర్యలు తీసుకోండి, లేదంటే మేం రంగం లోకి దిగుతామని “సుప్రీం” ఘాటుగా ఆదేశించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియ జేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మహిళలను హింస కు సాధనాలుగా ఉపయోగించడం అంగీకరించలేని విషయమని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని మండిపడింది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటి వరకు ఏం చేయలేక పోయారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని బెంచ్ గురువారం మండి పడింది.