కష్టపడి పనిచేసేది బుక్కెడు తిండి కోసమే. అదీ ఇంట్లో సమయం లేకపొతే హోటళ్ళను అశ్రయిస్తాం. అక్కడైన సరైన భోజనం దొరుకుతుందా అంటే నమ్మకం లేదు. హోటళ్ళు వడ్డిస్తున ఆహార పదార్ధాలలో ఇప్పటి వరకు బొద్దింకలు, బల్లులు, చిన్న చిన్న పురుగులను మాత్రమే చూసాం. కానీ, ఒక క్యాంటిన్ లోని ఆహారంలో ఏకంగా పాము వచ్చింది. తిండి విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇంతకంటే పరాకాష్ట మరొకటి ఉండదు. వివరల్లోకి వెళ్తే, ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) క్యాంటిన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉద్యోగులు నిత్యం ఇదే క్యాంటిన్ లో భోజనం, టిఫిన్లు చేస్తుంటారు. ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్ నుండి వండిన వస్తువులను చర్లపల్లి లోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. ఈవీఎం క్యాంటిన్ లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పులో నుండి పాము పిల్ల బయటపడడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికే భోజనాలు చేసి విషయం తెలుసుకున్న కొంతమంది ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే, గతంలో కూడా ఈ క్యాంటీన్ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో ఎలకలు, బీడీలు, సిగరెట్లు, బొద్దింకలు, పురుగులు ఆహార పదార్థాలలో కనిపించాయని, నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వందలాది మందికి భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్ వ్యవహారంలో అధికారులు చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యులైన వారిని వెంటనే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయాలని దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉద్యోగులు కోరుతున్నారు.