దేశంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు ఆదర్శప్రాయంగా నిలిచారని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత సత్యార్థి కైలాష్ అన్నారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పోలీస్ అధికారుల సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కైలాష్ మాట్లాడుతూ విధుల పట్ల నిబద్దత, అంకితభావం పోలీసు అధికారుల్లో ఎలా ఉంటుందో ఒక పోలీస్ అధికారి తనయుడిగా తనకు తెలుసునని తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో మనవ అక్రమ రవాణా నుంచి మహిళలు, పిల్లలను రక్షించేందుకు జరగుతున్న పోలీసింగ్ మొత్తం దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. వేల మంది తప్పిపోయిన పిల్లల జాడ తెలుసుకొని వారిని తల్లితండ్రుల వద్దకు చేర్చడంలో జరగుతున్న కృషి అభినందనీయమన్నారు. పెరుగుతున్న సాంకేతికత, సమాచార విప్లవంతో పోర్న్ వీడియోలు, బూతు సాహిత్యం విపరీతంగా యూట్యూబ్ లలో అందుబాటులో ఉన్నాయని, దీనితో పిల్లలు లైంగిక పరమైన వేదింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల అక్రమ రవాణా అనేది వ్యవస్తీకృతమైన, అత్యంత బలమైన మూలాలున్న నేరంగా ఉందని, ఈ నేరాలను అరికట్టడంలో తెలంగాణా పోలీసులు అమలు చేస్తున్న విధానాల వల్ల గణనీయమైన ఫలితాలు లభిస్తున్నాయని ప్రశంసించారు. ఒక పోలీస్ అధికారి సంతతికి నోబుల్ శాంతి బహుమతి లభించింది ప్రపంచంలోనే తన ఒక్కడికేనని , దీనికి పోలీసు అధికారి కొడుకుగా గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, డీజీపీ కార్యాలయానికి ఒక నోబుల్ అవార్డు గ్రహీత రావడం ఇదే మొదటి సారని అన్నారు. తెలంగాణా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పిల్లలు, మహిళల భద్రతకు రాష్ట్రం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చిందని, దీనిలో భాగంగానే అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ బచ్ పన్ బచావ్ ఆందోళన సంస్థ ఏర్పాటు చేసి దాదాపు ఒక లక్ష మంది చిన్నారులను సత్యార్థి కైలాష్ కాపాడారని తెలిపారు. సత్యార్థి కృషి వల్లే తప్పిపోయిన పిల్లలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు తోపాటు అనేక సంస్కరణలు వచ్చాయని వెల్లడించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు సత్యార్థి కైలాష్ ని ఘనంగా సన్మానించారు. అడిషనల్ డీజీ లు షికా గోయల్, సౌమ్య మిశ్రా, సంజయ్ కుమార్ జైన్, ఐజి లు విక్రమ్ జిత్ సింగ్ మాన్, షానవాజ్ కాసీం లతో పాటు రాష్ట్రంలోని పోలీస్ కమీషనర్లు, ఎస్.పిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.