తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో వర్షాలు, వరదలు పొంచి ఉన్నాయి. అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయని,దీనివల్ల కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని నాలుగు జిల్లాల్లో రెడ్ ఎలర్ట్, మరో నలుగు జిల్లాల్లో ఆరంజ్ ఎలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ లోని మూడు జిల్లాలలో రెడ్ ఎలర్ట్, ఏడు జిల్లాల్లో ఆరంజ్ ఎలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణ లోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రవాణా విషయంలో ప్రమాదకర సమస్యలు చోటుచేసుకుంటున్నాయి. సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, మల్కాజిగిరి, బేగంపేట, ఖైరతాబాద్, మలక్ పేట, ఎల్బీనగర్, మియాపూర్, కొండాపూర్లో వర్షం కురుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ కు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిఎహ్ఎంసి అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. వరంగల్-ఖమ్మం హైవేపై భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంతిని హైవే పై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. 5 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఓ లారీ వరద నీటిలో చిక్కుకోగా, లారీని బయటకు లాగేందుకు స్థానికులు నన తంటాలు పడ్డారు.