
ఆ కేసు వెనుక ఎవరున్నారో ఎవరికీ తెలియదు. నేరం కావాలని చేశాడో, చేయించారో అనేది ఒక రహస్యం. రాజకీయం చేసే వారికి అది చాల పెద్ద కేసు. సామాన్యుని దృష్టిలో మాత్రం ఆ కేసు ఓ రాజకీయం. కేసుని శోధిస్తున్నది మాత్రం దేశ అత్యున్నత సంస్థ ఐన జాతీయ పరిశోధన సంస్థ, అదే ఎన్.ఐ.ఎ.. రాటుదేలిన నేరస్థుల నుంచి నిజాలు, వాస్తవాలు రాబట్టే అధికార యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకున్న బలమైన సంస్థ ఈ ఎన్.ఐ.ఎ అనడంలో సందేహం లేదు. సంఘటనలో పాల్గొన్నది పదిమందీ కదూ, నిందితుడు వాడింది బాంబు కాదూ, భారీ అయుధమూ కాదు. పందెపు కోళ్ళ కాళ్ళకు కట్ట్టే కత్తి. అదే “కోడికత్తి”.ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో ఈ కత్తితో దాడి జరిగింది. ఈ సంఘటన జరిగి ఐదేళ్ళు కావస్తోంది. 2018 వ సంవత్సరంలో జరిగిన ఈ కేసులో దాడికి పాల్పడ్డ జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ “కోడికత్తి” శ్రీనుని సంఘటన జరిగినప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో నేరం జరిగింది కాబట్టి కేసుని సమగ్ర విచారణ కోసం స్థానిక పోలీసుల నుంచి ఎన్.ఐ.ఎ.కి బదలాయించారు. అప్పటి నుంచి రకరకాల కోణాల్లో విచారణ జరుగుతోంది. నిందితుడు మాత్రం సుమారు ఐదు సంవత్సరాలుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్షలో ఉన్నాడు. శ్రీనివాస్ ఎన్నిసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఒకసారి మాత్రం ఎన్.ఐ.ఎ.కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అప్పటి నుంచి శ్రీనివాస్ మళ్ళీ జైలుకే పరిమితం అయ్యాడు. అనేక సార్లు విజయవాడలోని ఎన్.ఐ.ఎ.కోర్టు ఈ కేసుని విచారణ జరిపినప్పటికీ కేసు కొలిక్కి రాకపోవడం, వాస్తవాలు, ఆధారాలు ఏంటనేది బయటి ప్రపంచానికి తెలియకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్వర్యంలో సంవత్సరాల తరబడి కేసు విచారణ జరగడం పట్ల కొందరు సీనియర్ పోలీసు అధికారులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ జాప్యం జరుగుతోందో అర్ధం కాకపోవడం విచారకరం అంటున్నారు. నిదితుడు వాడింది చిన్న కత్తి అయినా సరే టార్గెట్ చేయాలనుకునే వాళ్ళకు అది కచ్చితంగా ఆయుధమే. అసలు విషయాన్ని తేల్చడానికి ఇన్ని సంవత్సరాల సమయం తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇక, ఈ కేసుని తాజాగా మంగళవారం విచారించిన ఎన్.ఐ.ఎ.కోర్టు మరో మలుపు ఇచ్చింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది.



ఇదిలా ఉంటే, “కోడికత్తి” కేసు, ఈ కేసులో నిందితుడిని, జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారు 2007వ సంవత్సరంలో విజుయవాడలో జరిగిన అయేషా మీరా హత్య కేసు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసులో అమాయకుడైన సత్యం బాబు అనే యువకుడిని బలిపశుఫుని చేశారు. విచారణ పేరుతో 8 ఏళ్ళు జైలు జీవితం అనుభవించాడు. చివరికి పోలీసులు చూపిన పొంతన లేని ఆధారాలను పరిశీలించిన కోర్టు సత్యం బాబుని నిర్దోషిగా తేల్చి అతనికి లక్ష రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఐతే, ఈ కేసులో నిందితుడు అమాయకుడు. కానీ, “కోడికత్తి” కేసులో నిందితుడు మాత్రం నేరానికి ప్రయత్నించినవాడు. హత్యయత్నం చేశాడు అనడానికి అతనే ఆధారం. అక్కడ అభించిన “కోడికత్తి” కూడా సాక్ష్యం. ఆ నేరం కింద కచ్చితంగా శ్రీనివాస్ కి చట్టం శిక్ష వేయాలి, వేస్తుందనే నమ్మకం కూడా జనంలో ఉంది. అయితే, బయట జరుగుతున్న చర్చ మాత్రం ఒక్కటే. నిందితునికి బెయిల్ రాకపోవడానికి, వచ్చిన బెయిల్ రద్దు కావడాని కారణాలు ఏమిటనేది. ఇలాంటి ప్రముఖ కేసులోనే ఇంత జాప్యం జరగడం అటు కొందరు పోలీసు ఉన్నతధికారుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాలలోను మింగుడు పడడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేయడం మరింత చర్చకు దారి తీసింది. దీంతో కేసు ముగింపు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.