తిరుమలకు కాలి బాటన వెళ్ళే భక్తులు బెంబేలేత్తుతున్నారు. అలిపిరి నుంచి ఈ దారిలో వెళుతున్న వారిపై చిరుతలు దాడిచేసి చంపడం పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నడుచుకుంటూ వెళ్ళే భక్తులు ఎప్పుడు ఏ చిరుత దాడిచేస్తుందో తెలియక భక్తిని లోన దాచుకొని భయంతో పైకెక్కే పరిస్థితిని నెలకొంది. దీనికి తోడు మొన్న చిన్నారిపై దాడి చేసిన చిరుత పట్టుపడగా మరో మూడు చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నాయనే టిటిడి అధికారుల ప్రకటనతో భక్తులు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఒక చిరుత కాదు నడక మార్గంలో మరో 3 చిరుతలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు.మధ్యాహ్నం జరిగే టీటీటీ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.