ఉస్మానియ యూనివర్సిటీ భూములను శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణీకేశ్వర్ నగర్ లో ఉన్న సుమారు 2 ఏకరాల స్థలంలో పద్మారావు ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించడాన్ని ఖండించారు. పద్మారావు నిజంగా బస్తీ వాసులకు హాస్పిటల్ నిర్మించాలంటే అక్కడున్న వేరే భూముల్లో కట్టివ్వాలని సూచించారు.

యూనివర్సిటీ భూముల్లో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పడం పై విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ఈ విషయం పై ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ ఇంత వరకు స్పందించకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఉస్మానియా భూములు అన్యాక్రాంతం కాకుండా మిగిలి ఉండడానికి గత 5 దశాబ్దాలుగా ఎబివిపి చేస్తున్న పోరాటమే కారణమని పేర్కొన్నారు. ఇప్పటికైన రవీందర్ యాదవ్ స్పందించి ఉస్మానియా యూనివర్సిటీ భూమిని పరిరక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.డిప్యూటీ స్పీకర్ పద్మారావు తను చేసిన పత్రిక ప్రకటనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. అంతకు ముందు ఆర్ట్స్ కళాశాల ఎదుట పద్మారావు దిష్టి బొమ్మను తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి నాయకులు జీవన్, పృథ్వి, రాజు, పరుశురాం, వికాస్, సాయి, విఠల్, మధు, సందీప్, పవన్, ప్రసాద్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.