రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకర్ల ఇళ్ళ స్థలాల సమస్యని విలైనంత త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నించనున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు కలసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించే దిశలో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, కార్యదర్శి ఎస్ కే సలీమా, నాయకులు కె. పాండు రంగారావు, జే. ఉదయ్ భాస్కర్ రెడ్డి తదితరులు మంత్రి మహేందర్ రెడ్డిని కలిసి పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రికి తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు, హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, రైల్వే రాయితీ పాస్ లు, పెన్షన్ స్కీమ్ తదితర 12 దీర్ఘకాలిక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు.