జగన్ వ్యూహంలో “చాణక్యుడు”…

babu jail1

ప్రజా క్షేత్రంలో 45 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, రాజకీయాల్లో తిరుగులేని చాణక్య వ్యూహాలూ, ఎత్తులకు పై ఎత్తులు వేసి అన్ని రంగాలూ, విషయాల్లో అనుభవశీలిగా పేరు తెచ్చుకున్న నారా చంద్రబాబునాయుడు ఎక్కడ, ఎందుకు ఇరుక్కుపోయారు? ఆయన ఎన్నడూ ఉహించని “ఏడు చువ్వలను” ఎందుకు లెక్కబెడుతున్నారు? నిజంగా తప్పు చేశారా లేక అనుయాయుల మాటలు నమ్మి తప్పులో కలేశారా? ఇవి ఇప్పుడు సామాన్యుల మదిలో తలెత్తుతున్న సందేహాలు. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి  కాదు అయన ఒక నైపుణ్యం కలిగిన ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సిఇఒ) అనే ఒక పొగడ్త ప్రచారంలో ఉండేది. 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిలో అనేక పధకాలు, ప్రాజెక్టులను చేపట్టిన అయన ౩౦౦ కోట్ల రూపాయల కుంభకోణం ఆరోపణలు ఎదుర్కోవడం, జైలుకు వెళ్ళడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయ పరుస్తోంది.  నైపుణ్య శిక్షణ పధకంలో వివిధ స్థాయిల్లో అధికారులు చేతివాటం చూపించారనేది జగమెరిగిన సత్యం. అయితే ఇందులో బాబు అనుచర వర్గాలు ఏ మేరకు జేబులు నింపుకున్నాయనేది తేలవలసిన విషయం. అయితే, చంద్రబాబు వ్యూహాల గురించి తెలిసి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి జైలుకి పంపిందంటే దాని వెనుక భారీ కసరత్తే చేసినట్టు కనిపిస్తోంది. జగన్ ఏవైతే ఆరోపణలతో కేసుల్లో ఇరుక్కుపోయి సుమారు 16 నెలలు జైలు జీవితం గడిపాడో అదే తరహా కేసులో చంద్రబాబును నిందితునిగా చూపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి హయంలో “నీకది నాకిది” (క్విడ్‌ ప్రో కో) అనే అభియోగాలు జగన్ ని వేదించాయి. అవే జగన్ లో పట్టుదల పెంచాయి. ఎలాగైనా అధికారం చేపట్టాలనే ఏకైక సాక్ష్యంతో దాన్నిసాధించారు. తనపై విషం చిమ్మిన వారిపై దృష్టి సారించారు. వాళ్ళలో ఒకరు రామోజీరావు ఇంకొకరు చంద్రబాబు నాయుడు.

babu with lawyar

జగన్ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రభుత్వం రామోజీరావుని అడుగడుగునా వెంటాడుతూనే ఉందనేది బహిరంగ రహస్యం. కానీ, చంద్రబాబునాయుడు విషయంలో అలా చేయలేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం అన్నట్టు చంద్రబాబు హయంలో జరిగిన లోసుగులను  వెలికితిస్తూ నాలుగేళ్ళుగా రూపొందించిన  నివేదికలను ఆధారంగా చేసుకొని నైపుణ్య శిక్షణ పధకంలో చంద్రబాబు అధికారం, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు చూపుతూ ఆయన్ని అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. ఒక్కసారి వేటు వేస్తె తిరిగి కోలుకోవద్దనే క్రమంలో చంద్రబాబుపై మూడు, నాలుగు వేరే కేసులను కూడా సిద్ధం చేయడం గమనార్హం.

నైపుణ్య శిక్షణ కేసులో తేడా వచ్చి బాబు బయట పడితే పుంగనూరు దాడుల వ్యవహారం, లేకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు మార్పు వంటి వాటిలో కేసులను సిద్ధం చేయడంతో ప్రభుత్వ వైఖరి ఎంతనేది సామాన్యులకు సైతం ఇట్టే అర్ధం అవుతోంది. అధికారులను బెదిరించి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు చేశారని, లింగమనేనితో క్విడ్‌ ప్రో కో ఒప్పందాలు జరిగాయని, ఈ రెండువేల కోట్ల దోపిడీకి చంద్రబాబు రూపకర్త అని అందుకే ఆ కేసులో  ఏ–1 గా నారా చంద్రబాబు నాయుడుని  ఏ–6 గా నారా లోకేష్ను చేర్చినట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వ పోకడ చూస్తుంటే  రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును అక్కడికే పరిమితం చేయకుండా పిటి వారెంట్ పై రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల కోర్టులకు తిప్పడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.  అందుకే తాజాగా ఏపీ సీఐడీ అమరావతి రింగ్ రోడ్డు స్కాంలో పీటీ వారెంట్ కు ఆదేశించవల్సిందిగా కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తున్నారు. దీని వల్ల ఒక కేసు నుంచి మరో కేసుకు లింకు ఉన్నట్లు చూపించేందుకు సీఐడీ ప్రయత్నిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోస చంద్రబాబు నాయుడు జైలులో ఉండడం  తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అవినీతిని ఎత్తి చూపాలని వైసిపి భావిస్తుంటే, జగన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే  చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపారని చాటుతూ సానుభూతి పొందాలని టిడిపి యోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అన్ని విషయాల్లో చక్రం తిప్పే అనుభవం ఉన్న చంద్రబాబు జగన్ వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *