దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరగనున్న కీలక ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వరదలా ప్రవహించే సూచనలుకనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే బా వచ్చిన “కట్టల” పాములు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. ఆయా పార్టీలు పొరుగు రాష్ట్రాల నుంచి డబ్బు మూటలను తరలించే ప్రక్రియకు తెరలేపాయి. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న 42 కోట్ల నగదు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ.
ఈ డబ్బు ఎక్కడికి, ఎందుకు తరలించే ప్రయత్నం జరిగిందనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కానీ, ఆ నగదును తెలంగాణకు తరలిస్తుండగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, మొత్తం 50 కోట్లలో ఇప్పటికే తెలంగాణకు 8 కోట్లు తరలిపోయినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. తెలంగాణకు నగదు తరలిస్తున్నారనే విశ్వశనీయ సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. మొత్తం 22 బాక్సుల్లో నగదును పెట్టి లారీలో తరలిస్తుండగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని డబ్బు లెక్కింపు యంత్రాలతో లెక్కించారు. ఈ డబ్బు కర్ణాటకకు చెందిన ఓ మంత్రికి చెందినదిగా ప్రచారం జోరందుకుంది. ఈ విషయంపై అధికారుల నుంచి వివరణ అందాల్సి ఉంది.