తెలంగాణ ఎన్నికల్లో జనసేన, వైఎస్అర్ తెలంగాణ పార్టీల నిర్ణయాలు రాజకీయ పరిశీలకులను, సాధారణ ప్రజానీకాన్ని సందిగ్దంలో పడేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బలమెంతో స్పష్టంగా తెలియని ఆ రెండు పార్టీ లు రోజుకో దారిని వెతకడం ఓట్ల చిలికకు దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వ్యూహంలో జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు, తెలంగాణా ప్రాంతంలో వైఎస్అర్ తెలంగాణా పార్టీ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ రెండు పార్టీలు దేన్నీ ఆశించి రాజకీయాలు చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోది. జనసేన ఆంధ్రప్రదేశ్ లో అనుసరిస్తున్న విధానాలకు, తెలంగాణలో వేస్తున్న ఎత్తుగడలకు పొంతన లేకుండా ఉండడం ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్లకు సైతం అంతు పట్టడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కలిసొచ్చినా రాకున్నా తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన ముందుకు వెళ్తుందని రాజమండ్రి జైలు వద్ద ఖరాకండిగా చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల రంగంలో బిజెపితో అంటకాగడం విస్మయం కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. జనసేన తీసుకున్న ఈ నిర్ణయం అటు బిజెపి శ్రేణులు సహా జన సైనుకులకు కూడా మింగుడు పడడంలేదు. మరోవైపు ఇప్పటికీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బలమైన క్యాడర్ కలిగి ఉందనేది ఆ పార్టీ అధినేత గట్టి నమ్మకం. అయితే, అధినేతల ఏకపక్షంగా నిర్ణయాలు శ్రేణులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.
బిజెపి, జనసేనల పొత్తుతో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీనేతలు, కార్యకర్తలు, సానుభూతిపరుల్లో తమ ఓట్లను ఎవరికి వేయనలనే చర్చలు ఊపందుకోవడం గమనార్హం. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో క్యాడర్ ఒక్కసారిగా న్యూట్రల్ మోడ్ లోకి వెళ్ళింది. కనీసం ఆంధ్రాలో మాదిరిగా ఇక్కడ కూడా జనసేనతో బరిలోకి దిగుతుందేమో అని అంచనా వేశారు. కానీ, తెలుగుదేశంతో సంబంధం లేకుండా తెలంగాణలో జనసేన ఒంటరిగానే 32 స్థానాల్లో పోటీ చేస్తుందని నెల రోజుల కిందటే పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో తెలుగుదేశం తెలంగాణలో పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి తలెత్తిందని పలువురు రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు. 32 చోట్ల పోటికి నిర్ణయించుకున్న జనసేన చివరికి బిజెపితో కలిసి 9 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పట్ల జనసేన వైఖరి వల్ల తెలంగాణ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఈ మేరకు ఓట్లు రాబడతాయనేది ఆసక్తికర చర్చగా మారింది.
ఇదే సందర్భంలో వైఎస్అర్ తెలంగాణ పార్టీలో మరో గందరగోళ వ్యవహారం నెలకొంది. మహానేత కలల సాకారం కోసమంటూ తెలంగాణలో రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి, 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన షర్మిల ఒక్కసారిగా “యూ టర్న్” తీసుకోవడం పార్టీ లో వివాదానికి తెర లేపింది. మొన్నటి వరకు అధికార బి.ఆర్.ఎస్.పార్టీ పై , కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పై బలమైన ఆరోపణలు, సురకత్తుల వంటి విమర్శలు చేస్తూ జిల్లాల్లో పోటాపోటీ సమావేశాలతో సందడి చేసిన వైఎస్అర్ తెలంగాణ పార్టీ ఈ ఎన్నికల బరిలోఎంతోకొంత సత్తా చాటుతుందని పార్టీ శ్రేణులు భావించాయి. అందుకే షర్మిల చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలకు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. అంతేకాదు,ఎన్నికల వేడి రాజుకున్నాక ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి షర్మిలా రంగం సిద్ధం చేసినా వైఎస్అర్ టిపి నేతలు, శ్రేణులు చప్పుడు చేయలేదు. కానీ, షర్మిల పెట్టిన షరతులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. దీంతో 119 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని నెల రోజుల కిందట షర్మిల స్వయంగా ప్రకటించడంతో వైఎస్అర్ టిపిలో ఉత్సాహం పెరిగింది.
ఆయా స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికకు శ్రీకారం సైతం మొదలైంది. ఇదే సమయంలో పోటీ నుచి తప్పుకుంటున్నట్టు, కాంగ్రెస్ పార్టీ కి పూర్తీ మద్దతు ఇస్తున్నట్టు షర్మిల నుంచి ప్రకటన రాడంతో ఆ పార్టీ శ్రేణులు గుర్రుమన్నాయి. పార్టీ ని ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడానికి షర్మిల ఎవరనే బహిరంగ తిరుగుబాటు మొదలైంది. షర్మిల ఎవరు.., వైఎస్అర్ టిపి మాదే అంటూ గట్టు రామచంద్రరావు వంటి సీనియర్ నేతలు నిలదితకు దిగారు. దీంతో ఈ పార్టీ కింది స్థాయి క్యాడర్ లో తిరిగి అయోమయం తలెత్తింది. వైఎస్అర్ టిపి తరఫున పోటీలోకి దిగడానికి కొందరు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీల అగ్రనేతలలో నిలకడ లేని ఇలాంటి నిర్ణయాల వల్ల వాళ్లతో చేతులు కలిపిన పార్టీలకు ఓట్ల రూపంలో ఎంతటి ప్రయోజనం చేకురుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.