ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి “ఒంటెద్దు” పోకడగా వ్యవహరిస్తే అతన్ని నమ్ముకున్న ప్రజలకు ఎంత నష్టమో, ఎంత కష్టమో తెలంగాణ జనానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పదేళ్ళ పాటు నగరం నడిబొడ్డున ప్రగతి భవన్ కేంద్రంగా సాగిన పాలన కేవలం హంగామా మాత్రమే అనే విషయాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. దశాబ్ద పాలనలో అభివృద్ధి ముసుగులో ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపారనే సత్యాన్ని కొత్త ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఇది బిఆర్ఎస్ అధినేతలకు మింగుడు పడకపోవడం గమనార్హం. గత పది రోజులుగా తెలంగాణలో నెలకొంటున్న రాజకీయ ,పరిపాలన పరమైన పరిణామాలను పరిశీలిస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తెర వెనుక దాగి ఉన్న అనేక వాస్తవాలకు తెరలేస్తున్నట్టు కనిపిస్తోంది.

బిఆర్ఎస్ జమానాలో మొన్నటి వరకు జరిగిన ఆర్ధిక అంశాలు, అభివృద్ధి పనుల అసలు రూపాన్ని బయట పెట్టే శ్వేత పత్రం విడుదలకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిచే సమయంలో గులాబీ దళంలో గుబులు స్పష్టంగా కనిపించిందని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా కేటిఅర్, కవిత వంటి నేతలు శ్వేత పత్రం అంశాన్ని పక్కదోవ పట్టించేవిధంగా మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ అమలు చేయబోయే ఆరు గ్యారంటీల అమలు విషయాన్ని చర్చల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించారని భావిస్తున్నారు. ఎక్కడ కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినా మొదట చేపట్టే పని పాలనాపరమైన విధి,విధానాలను రూపొందించడం అనేది ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. ప్రజా పాలన పేరుతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొత్త ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా, శ్వేత పత్రం అంశం నుంచి సామాన్యుల దృష్టి మరల్చేలా బిఆర్ఎస్ నేతలు సుమారు వారం రోజుల పాటు వ్యవహరించిన తీరు ప్రతీ ఒక్కరిని విస్మయ పరిచింది. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత తమదే అని ప్రభుత్వం ఇచ్చిన హామీకి ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ వాటిని వెంటనే అమలు చేయాలి అన్నట్టు బిఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల సమయంలో వ్యవహరించిన తీరు పలువురిని విస్మయపరిచింది. అంతేకాక పదేళ్ళలో జరిగిన అభివృద్ధి, అప్పుల తీరుతెన్నులను బేరీజు వేసుకొని అందుకు తగ్గ పాలనకు వ్యూహ రచన చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం శ్వేత పాత్రలను రూపొందించే సమయంలో అదేదో తమ పాలనలో జరిగిన లోటుపాట్లను బయటకు తవ్వడానికే అన్నట్టు బిఆర్ఎస్ వ్యవహరించిందని కూడా వ్యాఖ్యలు వచ్చాయి. ఆరు లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయనే వాస్తవం బయటకు పొక్కగానే దానికి వివరణ ఇచ్చినట్టు తమ హయంలో జిల్లాకో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని కట్టామని, సంపద పెరిగిందనే వాదనలతో “స్వేద పత్రం” పేరుతో నివేదిక విడుదల చేయడం మరో చర్చకు దారి తీసింది. తమ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవడానికి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయాల్సిన బిఆర్ఎస్ ప్రభుత్వమే స్వయంగా ఆ పని చేస్తే ఆందోళన పడడం అంతుపట్టని విషయంగా మారింది. శాసన సభలో బిఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా అధికార పక్షం తమదే అన్నట్టు ప్రవర్తించారనే విమర్శలు కూడా వచ్చాయి. కొత్త ప్రభుత్వం శాసన సభలో “పవర్ పాయింట్ “ ప్రదర్శనతో తెలంగాణకు సంబంధించి పదేళ్ళ వాస్తవాలను ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు చూపే ప్రయత్నం చేస్తుంటే, పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు తమకు కూడా అవకాశం ఇవ్వాలని పొంతన లేని డిమాండ్ చేయడం ఏ ఒక్కరికీ అర్ధం కాలేదు. పదేళ్ళ పటు అధికారంలో ఉండి, సభా సంప్రదాయాలు తెలిసి కూడా ప్రతిపక్ష పాత్రను పోషించే మెళకువలు తెలియక పోవడం ఏమిటనే వాదనలు వినిపించాయి. తమ హయంలో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే అధికారం చేపట్టి 20 రోజులైనా పూర్తీ కాని కొత్త ప్రభుత్వంపై రకరకాల అంశాలను లేవనెత్తి ఒత్తిడి పెంచేందుకు బిఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని అధికార పక్ష నేతలు తిప్పికొడుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీని “మేడలు వంచి” అమలు చేయిస్తాం…, అమలు చేయకపోతే నిదనిలదిస్తాం అంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు ఇంకా వారిలో అధికార దర్పం తగ్గలేడనే దానికి అద్దం పడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.