నిర్లక్ష్యం నీడలో “నైటింగెల్స్”…

nusing cf copy

ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన నర్సింగ్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో పద్ధతి ప్రకారం కొనసాగిన ఈ వ్యవస్థ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. అనేక నియమ, నిబంధనలను తుంగలో తొక్కి కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. నర్సులు, నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న ట్యూ టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వంటి వారి పదోన్నతులు, బదిలీలు, పోస్టింగులు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటుందనే బలమైన ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పుట్టుకొచ్చిన కొన్ని నర్సింగ్ సంఘాల సభ్యులతో అధికారులు కుమ్మక్కై అమాయక నర్సులు, నర్సింగ్ బోధనా సిబ్బంది నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రులలో విధులు నిర్వహించాల్సిన కొందరు నర్సులు అధికారుల అండ చూసుకుని సంఘాల ముసుగులో కోఠీలోని  ఆరోగ్య శాఖ కార్యాలయాల వద్ద తిష్టవేయడం సమస్యగా మారింది. ఎవరైనా నర్సింగ్ సిబ్బంది ఏదైన అవసరంపై అధికారులను కలవడానికి వేస్తే చాలు గద్దల మాదిరిగా అక్కడే ఉండే  కొందరు నర్సింగ్ సంఘాల నేతలు బ్రోకర్ల అవతారం ఎత్తుతున్నారు. వారి వద్దకు వెళ్ళి సమస్యపై కూపీ లాగి “పని అవుతుంది… కానీ దానికి ఖర్చు అవుతుంది…” అంటూ బేరసారాలకు దిగడం బహిరంగ రహస్యంగా మారింది. గత ప్రభుత్వంలో వైద్య విద్యా శాఖకు పూర్తి స్థాయి సంచాలకులు లేక పోవడం, ప్రజారోగ్య విభాగానికి సంచాలకులు ఉన్నప్పటికీ ఆయన ఉద్యోగ బాధ్యతలతో పాటు రాజకీయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపడం ఆరోగ్య సిబ్బందికి శాపంగా మారింది. దీంతో ఆ రెండు శాఖల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న వారికి అనేక ఇబ్బందులే కాక, లంచాలు రూపంలో అపారమైన నష్టం వాటిల్లింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరో 64 కొత్త నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో “గద్దల” హడావిడి మరింత ఊపందుకుంది.

dme

ఆయాఆసుపత్రులు, కాలేజీల్లో ప్రమోషన్లకు అర్హులైన వారి జాబితాను ఆయా కార్యాలయాల్లోని అవినీతి అధికారుల నుంచి సేకరించి, అప్పుడే పోస్టింగుల పై బేరాలు మొదలు పెట్టినట్టు విశ్వశనీయ సమాచారం. ఈ వ్యవహారం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్టు తెలుస్తొంది. సేవ మత్రమే లక్ష్యంగా నర్సింగ్ వృత్తిని ఎంచుకొంటున్న వారిని పర్యవేక్షించడానికి, వారికి  సహకరించడానికి సరైన యంత్రాంగం లేకపోవడం సమస్యగా మారిందని పలువురు నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో విస్తరిస్తున్న నర్సింగ్ కళాశాలల పనితీరు మెరుగుపరచడానికి, సిబ్బందిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా “నర్సింగ్ డైరెక్టరేట్” ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని అనేక సార్లు గత ప్రభుత్వం ముందు మొర పెట్టుకున్నా ఏ ఒక్క అధికారి గానీ, మంత్రి గానీ పట్టించుకోక పోవడం నర్సులపై నిర్లక్ష్యానికి నిదర్శనం. అదే విధంగా నర్సింగ్ రిజిస్ట్రార్ వ్యవస్థ కూడా ఇష్టారాజ్యంగా ఉందని నర్సింగ్ సంఘాల నేతలు చెబుతున్నారు. అనేక ఏళ్లుగా  ఎలాంటి నిబంధనలు పాటించకుండా నర్సింగ్ రిజిస్ట్రార్ నియామకం జరుగుతోందని తెలుస్తోంది. రాత పరీక్ష  ద్వారా రిజిస్ట్రార్ నియామకం జరపాలని 2012వ సంత్సరంలోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1750 నెంబరు జి.ఓ.ను జారీ చేసినా అందులోని నిబంధనలు ఈ రోజుకీ అమలుకు నోచుకోలేదు. నర్సింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం వల్ల తమ మనుగడకు ముప్పు వాటిల్లుతుందనే ఏకైక ఆలోచనలతో  కొందరు కావలనే దశాబ్ద కాలంగా సంస్కరణలకు మోకాల్లడ్డుతున్నట్టు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి, సానుకూల దృక్పథంతో తెలంగాణ నర్సింగ్ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేసి, నర్సింగ్ కౌన్సిల్ ని ప్రక్షాళన చేయాలని వివిధ ఆసుపత్రుల నర్సులు, నర్సింగ్ కళాశాలల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఇదే విషయాన్ని మరోసారి ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధకారుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *