తెలంగాణ వైద్య విద్య శాఖ పరిధిలోని నర్సింగ్ విభాగంలో ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ఒంటెత్తు పోకడల వల్ల సుమారు పదేళ్లుగా ఈ విభాగంలోని అధికారులు, సిబ్బందిదే ఇష్టారాజ్యంగా ఉంది. ఎనిమిది ఏళ్లకు పైగా ఒకే హోదాలో తిష్ట వేసుకుని కూర్చున్న అధికారుల వల్ల అనేక సమస్యల ఎదురవుతున్నాయని వివిధ ఆసుపత్రుల నర్సులు, నర్సింగ్ కాలేజీల్లోని బోధనా సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి ఎన్నికల తర్వాత వైద్య విద్యా శాఖ సంచాలకులు రాజీనామా చేసినప్పటికీ పరిపాలనలో ఎలాంటి మార్పు కనిపించక పోవడం గమనార్హం. నర్సింగ్ విభాగానికి సంబంధించి కొత్తగా డిప్యూటీ డైరక్టర్ పోస్టును భర్తీ చేయాల్సి ఉండగా ఆ తంతు ప్రారంభం కాకుండా నర్సింగ్ కౌన్సిల్ లోని కీలక అధికారిణి అడ్డుకుంటున్నట్టు బలమైన ఆరోపణలు వస్తున్నాయి. కొంత కాలంగా ఇన్ చార్జీ డి.డి.గా వ్యవహరిస్తున్న అధికారి స్థానంలో అర్హులైన పూర్తీ స్థాయి డి.డి. ని నియమించాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, డి.ఎం.ఇ. కార్యాలయంలో ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అసిస్టెంట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ వంటి వారు కొత్త వారిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారని నర్సింగ్ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో అనేక నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు కొత్త ప్రభుత్వం చర్యలు చేపడుతున్న తరుణంలో అవినీతి అధికారులు బదిలీ కాకపోవడం సమస్యగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిణి ఒకరు నర్సులు, నర్సింగ్ కాలేజీల్లోని బోధనా సిబ్బంది పదోన్నతుల సమయంలో డబ్బు ముట్టాజెప్పనిదే ఫైలు కదిలించడం లేదని, ఇదే విషయన్ని గత సంచలకునికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని కొందరు నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సులు, నర్సింగ్ కాలేజీల అభివృద్ధి, వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన డిప్యూటీ డైరక్టర్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన ఈ అధికారిని నియమించాలని కోరుతున్నారు. ప్రస్తుతం అర్హత లేని వారికి ఈ పోస్టులో నియమించడానికి దొడ్డిదారి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.ఇదే విషయాన్ని ప్రస్తుత సంచాలకుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. డిప్యూటీ డైరక్టర్ పోస్టు వ్యవహారంలో ఆరోగ్య శాఖ మంత్రి సైతం జ్యోక్యం చేసుకొని సమర్థులు, అర్హులు అయిన వారినే నియమించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై సంచలకురాలుని వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులో లేరు.