రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆర్గ నైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా సమీకృత ప్రయోగ మేనిఫెస్టోను ప్రకటించింది. వచ్చే 14 నెలల్లో చేపట్టనున్న ప్రయోగాల్లో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించినవి ఏడు ఉన్నాయని అందులో తెలిపింది. స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల ప్రయోగాలూ ఏడు ఉన్నట్లు పేర్కొంది. వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ సంబంధిత సేవల కోసం రూపొందించిన ‘ఇన్‌శాట్-3డీఎస్’ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఆర్థిక సంవత్సరం లోనే చేపట్టనుంది. మార్చిలో ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3’ మూడు పేలోడ్ లను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇస్రో వాణిజ్య విభాగమైన ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ 2 ఫుల్ స్టాఫ్, నాలుగు పీఎస్‌ఎల్‌వీ, రెండు ఎస్‌ఎస్‌ఎల్‌వీ, ఒక ఎల్‌వీఎం-3 మిషన్‌ను చేపట్టాలని భావిస్తున్నట్లు మేనిఫెస్టోలో వివరించారు.