దేశంలో రానున్న ఐదు రోజుల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ , సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అండమాన్ నికోబర్ దీవులలోనూ రాబోయే 5 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల15-19 తేదీలలో పశ్చిమ రాజస్థాన్‌లో, 15-18 తేదీలలో ఉత్తరప్రదేశ్‌లో,15 ,16 తేదీలలో బీహార్‌లో వేడి తరంగాల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

అదేవిధంగా రానున్న 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళలో గంటకు 30 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. 15, 16 తేదీలలో తెలంగాణ, కోస్తాంధ్ర , యానాం, రాయలసీమ, ఉత్తర కర్ణాటకలో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఉరుములతో కూడిన గాలులు వీచే అవకాశం ఉంది. 15-17 తేదీల్లో తమిళనాడులో, 15-19 తేదీల్లో కర్ణాటకలో, 15, 16 తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమలో మే 15, 18,19 తేదీల్లో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.