ప్రజా సమస్యల పై పోరాడాల్సిన రాజకీయ పార్టీ నేతలు వ్యక్తిగత వ్యవహారాలను తెరపైకి తీసుకురావడం వింతగా కనిపిస్తోంది. అదీ ఏదో చిన్నా చితకా సరదా వ్యాఖ్యలు కాదు.. ఏకంగా పెళ్ళిళ్ళు, పెళ్ళాల వరకు వెళ్ళడం రాజకీయ పరిపక్వత లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. సరిగ్గా ఇదే తంతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార పార్టీ వైసీపీకి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెలా ఉంది. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ మూడు,నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారని వ్యాఖ్యానించడం పవన్ కళ్యాణ్ కి మింగుడు పడడంలేదు. జగన్ మాటలపై స్పందిస్తూ అసలు నాలుగు పెళ్ళిళ్ళు ఎవరు చేసుకున్నారు… ఆ నాలుగో పెళ్ళాం జగన్ ఏమో అంటూ పవన్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రాజకీయ సభల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన నేతలు తమ ప్రసంగాల్లొ ఇలాంటి మాటలకు ప్రాధాన్యం ఇవ్వడంతో చివరకు ఆ వ్యాఖ్యలే ప్రధాన శీర్షికలుగా మారుతున్నాయి. అంతేకాక సభలకు వచ్చిన వాళ్ళు సైతం ఆ వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.