“దొర” గడీలోకి బహుజనులు…!

bahujan c

రాజకీయ ప్రత్యర్ధులు, రాజకీయ శత్రువులను గడీ దరిదాపుల్లోకి కూడా రానివ్వని గులాబీ దళపతి ఎత్తుగడల్లో మార్పునకు కారణం ఏమిటి? మొన్నటి ఎన్నికల వరకు ఒంటెత్తులతో తిరుగులేని అధికారం చెలాయించిన కేసీఆర్ ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకున్నారు? ఎన్నికల ఫలితాల తర్వాత ఫాం హౌస్ లో ఏలాంటి వ్యూహా రచనలు జరిగాయి? శాసన సభ ఎన్నికలలో ఘోర పరాజయం చవి చూసిన భారత రాష్ట్ర సమితి మనుగడ కోసం కేసీఆర్ మెట్లు దిగక తప్పడం లేదా? మొన్నటి వరకు బి.అర్.ఎస్.తో అంటకాగిన పార్టీ మొహం చాటేసిందా? తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పై ఇలాంటి అనేక ప్రశ్నలకు ఒక్కసారిగా తెరలేసింది. శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని బలాలను ఉపయోగించినా సగటు ఓటరు లెక్కచేయక పోవడంతో ఓడిన భారాస రానున్న లోక్ సభ ఎన్నికల్లో పంథా మర్చుకొక తప్పదనే నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టం అవుతోంది.

dora bsp c

దీనికి బహుజన సమాజ్ పార్టీ (బి.ఎస్.పి.)తో చేతులు కలపడమే ఉదాహరణగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికల వరకు కూడా అప్పటి బి.అర్.ఎస్. ప్రభుత్వం పైనే కాకుండా కేసీఅర్,కెటిఆర్, కవిత లను వెంటడి దుమ్మెత్తి పోసిన బి.ఎస్. పి. నేత ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ కావడం, ఇద్దరూ కలిసి రేపు జరిగే లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీల పొత్తు వ్యవహారాన్ని వెల్లడించడం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలకు దారి తీసింది.బి.ఎస్.పి.తో పొత్తు వల్ల రాష్ట్రంలో దళిత వర్గం ఓట్లు తమ గంపలో పడతాయని బి.అర్.ఎస్. అంచనా వేస్తోంది. అయితే, శాసనసభ ఎన్నికల్లో బి.ఎస్.పి. రాష్త్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సహా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క అభ్యర్థి విజయం సాధించలేదు. దీంతో ఆ వర్గం ఓట్లు కాంగ్రెస్, బిజెపిలు కైవసం చేసుకున్నాయని తేలిపోయింది గులాబీ దళపతి అంచనా కూడా ఇదే. అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా అన్నింటికీ తలొగ్గి కేసీఅర్ ప్రవీణ్ కుమార్ తో చేతులు కలిపారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

kcr praveen in

అయితే, ఇక్కడే మరో ప్రధాన చర్చ తలెత్తింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో భాజపా అధికారంలో ఉండగా పరాజయంతో ఫాం హౌస్ కి పరిమితం అయిన భారాసకు దళిత ఓట్లు ఎలా పడతాయనే విశ్లేషణలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో అధిక శాతం దళితుల ఓట్లు కాంగ్రెస్ దక్కించుకుందని తెలుస్తోంది. గ్రామ స్థాయిలో గట్టి పట్టు ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని పొత్తుతో వెళ్తున్న భారాస వైపు ఆ వర్గం ఏమేరకు మోగ్గు చూపుతుందనేది సమన్యులలోనూ తలెత్తుతున్న ప్రశ్న. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కవితని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన వారిలో ప్రవీణ్ కుమార్ ఒకరు. అంతేకాక , ఈ అంశం పై అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర కూడా చేశారు. అదేవిధంగా గ్రూప్ -1 పేపర్ లీకేజీ పై ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రవీణ్ రాజకీయ మనుగడ కోసం భారాసతో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి గానీ, వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి గానీ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ భారాస సిట్టింగ్ ఎం.పి. రాములు భాజపా కండువా కప్పుకోవడంతో ఆ స్థానాన్ని ప్రవీణ్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఇన్ని సమీకరణాల మధ్య భారాస, బహూజన సమాజ్ పార్టీల మధ్య కుదిరిన పొత్తు ఒప్పందం, కేసీఆర్ ఎత్తుగడలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. అప్పుడే “దొర” తన గడీని బహుజనుల కోసం ఎందుకు తెరిచారో తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *