దేశంలో మూడో సారి గద్దెనెక్కాలని ఆరాట పడుతున్న కమల దళానికి అమ్ముల పొదిలో బలమైన ప్రచార అస్త్రం కొరవడినట్టు కనిపిస్తోంది. మూడు దశాబ్దాలుగా “బాబ్రీ మసీదు – రామజన్మ భూమి” గళం ఎత్తుకొని అంచెలంచెలుగా ఎదిగిన భారతీయ జనతా పార్టీకి ఈ లోక్ సభ ఎన్నికల్లో “నమో” జపం తప్ప మరో నినాదం లేకుండా పోయింది. రామాలయాన్ని నిర్మించి తీరుతామన్న వాజపేయి, అద్వానీ, మోడీ వంటి నేతలు 1992 నుంచి చేస్తున్న హామీలకు మొన్న అయోధ్యలో ముగిసిన రాముడి ప్రాణ ప్రతిష్టతో తెర పడింది. గతంలో అంటే వాజపేయి హయాంలో భాజపా పాలనలో జరిగిన పొక్రాన్ అణు ప్రయోగం, కార్గిల్ పోరు అప్పట్లో ఆలయానికి తోడుగా మంచి ప్రచారాస్త్రాలుగా మారాయి.

దేశంలో భాజపా పుంజుకోవడానికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం అధారమైతే హిందుత్వ, దేవాలయం, పొక్రాన్, కార్గిల్ అంశాలు కూడా దోహద పడ్డాయి. బిజెపి ఆశించినట్టే అధికారంలోకి వచ్చింది. పదేళ్ల పాటు దేశాన్ని ఏలిన పార్టీగా కాంగ్రెస్ తర్వాత భాజపా నిలిచింది. అయితే, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీనే మళ్ళీ అదికారంలోకి వస్తుందనే గట్టి అంచనాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ, మోడీ 400 మావే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులను చూస్తే ఎన్ని స్థానాలు వస్తాయనేది అంచనాలకు అందకుండా ఉంది.

మోడీ, అమిత్ షాలతో పాటు భాజపా నేతలు చేస్తున్న ప్రచారంలో ప్రజలకు స్పష్టత ఇచ్చే అంశాలు ఉండడం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాశ్మీర్ స్వయం ప్రతిత్తికి సంబంధించి ఆర్టికల్ 370, మైనారిటీల రిజర్వేషన్ల వ్యవహారం వంటి ఎన్నికల ప్రచార అస్త్రాలు ఏ మేరకు జనాన్ని ఆకర్శిస్తాయనేది భాజపా ఆ పార్టీ ప్రచార వ్యూహకర్తలకే తెలిసి ఉండాలి. భాజపా మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మరుస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తోంది. కానీ,దీనిపై భాజపా జనానికి పూర్తీ స్థాయి స్పష్టత ఇవ్వలేక పోతోందని మేధావి వర్గం పేర్కొంటోంది.

“మతపరమైన రిజర్వేషన్ల” కే బీజేపీ వ్యతిరేకం అంటూ ఆ పార్టీ నేత నడ్డా చేస్తున్న ప్రచారం లోకిక భారత్ లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోవచ్చని పరిశీలకుల అంచనా. దేశంలో “మతపరమైన” అంటే ఒక్క ముస్లింలే కాదు, క్రైస్తవుల వంటి వారు కూడా ఆలోచనలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. భాజాపా ఒకవేళ అధిక స్థానాలు గెలుచుకున్నా రిజర్వేషన్ల అంశం తిరగబడితే మాత్రం ఆ పార్టీ వేస్తున్న అంచనాల్లో ఖచ్చితంగా తేడా వస్తుందని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. గత కొద్ది నెలలుగా మోడీ పర్యటనల్లో దేవాలయాలను చుట్టి రావడం, కోనేటి నీటి స్నానాలు ఆచరించడం, “నమో” జపంతో ప్రసంగాలు ముగించడం వంటి అంశాలను దేశంలోని వివిధ వర్గాల వారు నిశ్చితంగా పరిశీలించడం కూడా ఫలితాలపై ప్రభావం చూపవచ్చనే చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అనేక అంచనాతో ఉన్న కాషాయ పార్టీ ఎన్ని స్థానాలతో, ఎలా అధికారాన్ని చేజిక్కించుకుంటుందో వేచి చూడాలి.