“చల్లని” కబురు…

IMG 20240530 WA0014

దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇవి గురువారం ఉదయం కేరళ (Kerala)ను తాకాయని ఐఎండీ (IMD) అధికారికంగా వెల్లడించింది.

లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఈ కబురు ప్రజలకు ఊరట కల్పించినట్లయ్యింది.మన దేశంలో 52 శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40 శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది భూ మధ్యరేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *