“గోవిందా”… మన్నించు….!

sry govinda cf

కృత, త్రేతా, ద్వాపర యుగాలను ఏలిన ఓ స్వామి… నీకు కలియుగ పోకడలు తెలియనివి కాదు. ఈర్ష్య ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఎత్తులు-పై ఎత్తులు ఆనాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్న సంగతి జగమెరిగిన సత్యమే. కాకపోతే, ఈ కలియుగంలో అవి కాస్తా పరాకాష్టకు చేరడం ఏడు కొండల మీద నిశ్చల రూపుడివైన నిన్ను కన్నెర్రకు గురిచేశాయి. సందేహం లేదు..సకల జనుల సంతోషాన్ని కోరే నీకు ఆగ్రహం తెప్పించే అనేక విషయాలు తిరు గిరులను చుట్టు ముడుతున్నాయి.  పవిత్ర పుణ్య భూమిని రాజకీయ సభలతో అపవిత్రం చేస్తూ నాలుగు దశాబ్దాల కిందట పడ్డ బీజం ఏపుగా పెరగడం కూడా నీలోని సహనాన్ని పరీక్షిస్తుంది. కానీ, ఈ నలభై ఏళ్లుగా నీ పాదాల ప్రాంతమైన తిరుపతిలో జన సభలు పెట్టిన ఏ రాజకీయ నేత కూడా రాణించలేక పోవడం నీ మహిమలకు నిలువెత్తు నిదర్శనం. స్వామీ నీలో ఉగ్రరూపం బయట పడడానికి మానవమాత్రులమైన మా తప్పిదాలే అనేకం కనిపిస్తున్నాయి. మీరు సంచరించే శేషాచల అడవుల్లో అక్రమాలు, ప్రీతి పాత్రమైన “లడ్డూ”లో కల్తీ నెయ్యి, నిన్ను దర్శించేందు కావలసిన టోకెన్ లు, టిక్కెట్ ల బ్లాక్ మార్కెట్, దొడ్డి దారిన లడ్డూ అమ్మకాలు, కాటేజీల కేటాయింపు ఇలా ఒక్కటేమిటి గోవిందా ఏడు కొండల పేరుతో జరుగుతున్న నిలువు దోపిడీని ఒక్కసారి విశ్లేషణ.

babu svms

అపచార ఫలితమే దైవాగ్రహం..!

తిరుమల,తిరుపతి దేవస్థానం..ఇది సామాన్య జన భక్తికి, సనాతన ధర్మానికి ఏడు కొండల ఎత్తు సాక్ష్యం. దైవ దర్శనం అనేది మోక్షం కోసం. ఆ మోక్షం కోసం వెళితే ప్రాణం పోవడం దురదృష్టకరం. శతాబ్దాలుగా గోవింద నామస్మరణతో అలరారే దివ్య క్షేత్రం చుట్టూ కొంత కాలంగా రాజకీయ పొగ కమ్ముకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న ప్రభుత్వ పెద్దలు ఏడు గిరులకు రాజకీయ రంగు ఎందుకు పులుముతున్నారనేది అంతుపట్టని చర్చ. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజుకుంటున్న రాజకీయ రచ్చ శేషాచలం అడవులను చుట్టూ ముడుతూ స్వామి వారి ఆగ్రహానికి దారితీస్తున్నాయి. గోవిందుడికి ప్రీతిపాత్రమైన లడ్డూపై కొన్ని నెలల కింద చెలరేగిన కల్తీ నెయ్యి దుమారం అపశకుణంగా, అపచారంగా వెంటాడుతోందనేది ఆధ్యాత్మిక నిపుణుల అభిప్రాయం. అన్ని వర్గాల వారు అత్యంత భక్తితో సొంతం చేసుకుంటున్న లడ్డూ కల్తీ అయిందన్న అవివేక ప్రచారం ఒక్క ఆ పుణ్య క్షేత్రం లోనే కాదు ప్రపంచ నలుమూలల దావణాలంలా గుప్పుమన్నది. వివిధ వర్గాల వారి మనోభావాలను ఒక్క సారిగా దెబ్బ తీసింది. లడ్డూ ముసుగులో సాగిన రాజకీయ చదరంగంలో ఒకరిపై ఒకరు బలమైన ఆరోపణలు గుప్పించుకొని స్వామి వారి సహనాన్ని పరిక్షించారే తప్ప నెయ్యిలో కల్తీ జరిగిందో లేదో చెప్పే సాహసం నేటికీ చేయలేకపోవడం క్షమార్హం. అసలు లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి ఎందుకు తీసుకువచ్చారో ఆ భగవంతునికే తెలియాలి. బహుశా స్వామి వారికి తెలిసి ఉంటుంది కాబట్టే అనుకుంటా వైకుంఠ ఏకాదశి ఘడియల్లో కన్నెర్ర చేసి ఉంటారని భక్తుల నమ్మకం.

తొక్కిసలాట రూపంలో అపాచారాన్ని పైకి (తిరుమల) రానివ్వకుండా తన పాదాల వద్దనే (కింద తిరుపతి) తొక్కి పెట్టిన మహిమ పాలకులకు, రాజకీయ ముసుగు వేసుకున్న ధవళ వస్త్ర ధర్మ కర్తలకు ఒక సంకేతమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత జరిగినా రోజు తిరగ కుండానే మాటల రూపంలో కొత్త భాగోతం బయటకు వచ్చింది. తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ ధర్మకర్తల మండలి క్షమాపణ చెప్పాలని సాక్షాత్తూ ప్రభుత్వంలో భాగస్వామి, మంత్రి అయిన పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడం రచ్చబండ వద్ద కొత్త తరహా రాజకీయ చర్చలకు దారి తీసింది. ఇటీవలే పగ్గాలు చేపట్టిన బి.ఆర్. నాయుడు నేతృత్వంలోని ధర్మ కర్తలకు పవన్ వ్యాఖ్యలు ఒక పట్టాన మింగుడు పడడం లేదు. ఘటన జరిగిన వెంటనే టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పిందని బి.ఆర్. నాయుడు గుర్తు చేయడం గమనార్హం. తిరుపతి తొక్కిసలాట ఘటన పాలకులకు ఒక గుణపాఠం లాంటిది కావాలి. పెరుగుతున్న స్వామివారి భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు, రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. స్వామివారి దర్శనం విషయంలో పరిమితులు, పవిత్రతను పరిగణనలోకి తీసుకోకుంటే ఇలాంటి దుర్ఘటనలు తలెత్తే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. రాజకీయ అవసరాలకు ఏడు కొండలను వాడుకునే ఆలోచనకు స్వస్తి పలికి, ఆ పవిత్ర క్షేత్రం భక్తకోటికి సొంత అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *