కాళ్ళ బేరం ముందు”ఆత్మ గౌరవం”!

war stop c

ఏ సంఘటనలోనైనా, ఏ కేసులోనైనా బాధితులకు న్యాయం జరిగిందంటే నిందితులకు సరైన శిక్ష పడ్డట్టు అర్ధం. కానీ, దేశ ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన పహల్గాంలో పర్యాటకుల ఊచకోత ప్రభుత్వ చేతగాని తనానికీ, నిఘా వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఆ సంఘటన అనంతరం జరిగిన అనేక పరిణామాలు అంతుపట్టకుండా ఉన్నాయి. చివరకు ముష్కరుల తుపాకులకు బలైన వారి ఆత్మలను  సైతం క్షోభ పెడుతున్నాయి. కాశ్మీరు లోయలో ఏరులై పారిన రక్తపు ధారలు ఇప్పుడు రాజకీయ పార్టీ ప్రచారానికి దారులుగా మారుతున్నాయి. అమాయకులను అరాచకంగా కూల్చి వేసిన తీవ్రవాదుల అంతం చూస్తామని త్రివిధ దళాలతో బయలు దేరిన కేంద్ర ప్రభుత్వ తీరుకు దేశంలోని ప్రతి ఒక్కరూ జేజేలు కొట్టారు. ఈ దెబ్బతో అయినా ఏడు దశాబ్దాల పాకిస్థాన్ పీడ విరగడ అవుతుందనీ, కాశ్మీర్ వాస్తవాధీన రేఖ చెరిగి పోతుందని, తీవ్రవాదులు పారి పోతారని 140 కోట్ల మంది ఆశ పడ్డారు. అదే లక్ష్యంగా సైన్యం కూడా కదన రంగంలోకి కాలు మోపింది. ఇంకేం రాకెట్లు,మిసైళ్లు, డ్రోన్లు, మార్టర్లతో పాకిస్థాన్ పారిపోయేలా చేస్తారని కొండంత ఆశ పడ్డారు.కానీ, ఆశల “సిందూరం” మధ్యలోనే చెరిగి పోతుందని,

modi trump

మహా భారతంలో సూర్య కాంతిని అడ్డుకున్న “సుదర్శన చక్రం” ఈ యుద్ధానికి మధ్యలోనే తెర దించుతుందని ఏ ఒక్క భారతీయుడు ఊహించ లేదు. గత నెల16న పహల్గాంలో జరిగిన ఘటన అన్ని ప్రతీ వర్గాన్ని, అన్ని రాజకీయ పార్టీలను కలచి వేసింది. అందుకే మరో ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సరే అంటూ వెన్ను తట్టాయి. ఎవరి మీద ఎన్ని ఆంక్షలు విధించినా పట్టించుకోలేదు. ముందు పని చేసుకు రాండి అంటూ ఇంట్లో వ్యక్తిని  సాగనంపినట్టు త్రివిధ దళాలకు “అల్ ది బెస్ట్” చెప్పారు. మూడు, నాలుగు రోజులు ఇరు దేశాల సరిహద్దుల్లో హోరా హోరీగా సాగిన పరస్పర దాడులు, ఉగ్ర మూకల స్థావరాల నేల మట్టం, పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుడు ఇలా ప్రతీ సంఘటన భారతీయుల్లో అనేక ఆశలు రేకెత్తించాయి. ప్రధానంగా పహల్గం నరహంతకులు మట్టి కరవడం ఖాయం అనే నమ్మకానికి వచ్చారు.

rajnath meet

అంతేకాదు, హంతకులకు తగిన బుద్ధి చెబుతామంటూ కేంద్ర రక్షణ, హోమ్ మంత్రులు రాజ్ నాథ్ , అమిత్ షా లు గుప్పించిన ప్రకటనలు సైతం జనం ఆసక్తి బలాన్ని చేకూర్చాయి.మూడు రోజుల పాటు సరిహద్దు సంఘటనలను ప్రతీ ఒక్కరూ క్షణ క్షణం ఆతృతగా అనుసరించారు. తెర వెనుక ఎక్కడ ఏ పరిణామం చోటుచేసుకుందో కానీ భారత్, పాకిస్థాన్ మధ్య అవగాహన కుదిరిందంటూ అమెరికా నుంచి ట్రంప్ శుభాకాంక్షల ప్రకటన చేయడంతో యుద్ధ ఫిరంగుల మోత ఒక్కసారిగా మూగ పోయింది. మిసైళ్ల వేల కిలోమీటర్ల వేగం జీరో స్థాయికి దిగిపోయింది. దాయాది దేశం ఆగడాలను తుద ముట్టించాలని ముందుకు సాగుతున్న సైనిక దళాలు చేసేది లేక ఎడారి ఇసుకలో, మంచు కొండల్లో సేదకు ఉపక్రమించాయి. ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే “ఆపరేషన్ సిందూర్” ప్రారంభించినదో అది నెరవేరకుండానే వెనక్కి రావడం ఒకవిధంగా చెప్పాలంటే “తగ్గడం” ఒక్కసారిగా రకరకాల చర్చలకు దారితీసింది. కాశ్మీర్ లోయలో జరిగిన సామాన్యుల ఊచకోత ముష్కరులను తుద ముట్టించి బాధితుల ఆవేదనను కొంత మేరకైనా తీర్చాలనేది “సిందూరం” ప్రధాన ఎజెండాగా భావించారు. ప్రధాని మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా భరోసాగా ఇదే విషయం చెప్పుకొచ్చారు. దేశ సరిహద్దుల్లో సైన్యం మోహరింపు, వార్తా పత్రికలకు, ఇతర మీడియా సంస్థలకు “లక్ష్మణ రేఖ” గీయడం వంటి హడావిడి చూసి పహల్గం దోషుల అంతం దగ్గర పడిందని నమ్మారు.

masood pm

యుద్ధం జరగాలని ఏ ఒక్కరూ కోరుకోరు. కానీ, రోజుల వ్యవధి లోనే ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. “యుద్ధం మొదలైంది” అని అధికారికంగా  ప్రకటించక పోయినా హోరాహోరీగా అప్రకటిత యుద్ధమే జరిగింది. మన త్రివిధ దళాలు బాధ్యతగా ప్రాణాలను ఫణంగా పెడుతూ ముందు సాగాయి. దాయాది దేశానికి దడ పుట్టించాయి. పాకిస్థాన్ సైన్యానికీ, ఆ దేశం పెంచి పోషించే ఉగ్రమూకలకు కంటి మీద కునుకు లేకుండా వెంటాడారు. ఆ హోరు ఒక్కసారిగా సద్దుమణిగింది. పాకిస్థాన్ కాళ్ళ బేరానికి వచ్చిందనీ, మన తడాకా తెలిసిందని, పహల్గం బాధితులకు న్యాయం జరిగిందని నిర్ణయిస్తూ కేంద్రం తన ప్రధాన లక్ష్యానికి “సుదర్శన చక్రాన్ని” అడ్డువేసింది. దేశంలో అత్యంత సమర్థవంతమైన నిఘా వ్యవస్థలు, నిపుణులైన అధికార యంత్రాంగం, ఆధునిక పరిజ్ఞానం ఉండి కూడా నెల రోజులు దగ్గర పడుతున్నా పహల్గం నరహంతకుల ఆచూకీ తెలియక పోవడం నిజంగా విచారకరం. దాడికి పాల్పడ్డ మూక ఏ వ్యూహంతో తప్పించుకుందో అంతుపట్టని ప్రశ్న. వాళ్ళు మన “సుదర్శన చక్రాన్ని” తప్పించుకోవడం, “సిందూరం” మంచు దుప్పట్లోకి జారిపోవడం దురదృష్టకరం. ఎవరు ఎన్ని చెప్పినా ఈ హంతకులు అంతమైన రోజే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినట్టు భావించాలి. ఆ మంచి రోజు కోసం వేచి చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *